టిటిడి కళాశాలలకు అటానమస్‌ హోదా

Jan 19,2024 22:06
టిటిడి కళాశాలలకు అటానమస్‌ హోదా

ప్రజాశక్తి-తిరుపతి సిటి తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ, పిజి కళాశాల ఎస్‌విఆర్ట్స్‌, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ 10 సంవత్సరాల పాటు అటానమస్‌ (స్వయంప్రతిపత్తి) హోదాను మంజూరు చేసిందని టిటిడి జేఈవో సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థలలో మూడు కళాశాలలకు అటానమస్‌ హోదా లభించినట్లు చెప్పారు. దీని వల్ల టీటీడీ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యాప్రమాణాలు, కళాశాలల అభివద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్‌లో మార్పులు చేసుకోవడానికి వీలవుతుందని చెప్పారు. తద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక సేవా దక్పథంతో విద్యా బోధన, ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీ బేస్డ్‌ విద్యావిధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తామని వివరించారు. ఇందుకు సహకరించిన అద్యాపక బృందం, సిబ్బందికి అభినందనలు తెలిపారు.ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల 1945లో 80 మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు 22 కోర్సులతో 2,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1952లో శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల ప్రారంభమై 26 కోర్సులతో 2,800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1952లో ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల ప్రారంభమై ప్రస్తుతం 19 కోర్సులలో 1850 మంది విద్యార్థులు చదువుతున్నారు. టిటిడి విద్యాశాఖాధికారి డాక్టర్‌ ఎం.భాస్కర్‌ రెడ్డి, టీటీడీ విద్యా సంస్థల సలహాదారు మోహన్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాళ్ళు డాక్టర్‌ టి.నారాయణమ్మ, డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, మహదేవమ్మ, కళాశాల అధ్యాపక బందాన్ని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

➡️