టిటిడి హెల్త్‌ టెండర్లలో కొత్త నిబంధనలు రద్దు చేయాలి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల ఆందోళన

Jan 28,2024 23:01
టిటిడి హెల్త్‌ టెండర్లలో కొత్త నిబంధనలు రద్దు చేయాలి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల ఆందోళన

ప్రజాశక్తి- తిరుపతి సిటి: ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు ఇబ్బందికరంగా టిటిడి ఇటీవల తీసుకొచ్చిన హెల్త్‌ టెండర్లలో కొత్త నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ టిటిడి ఎఫ్‌ఎంఎస్‌, హెల్త్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున టిటిడి పరిపాలన భవనం ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. వేలాది మంది కార్మికులు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కార్మికులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మద్దతు తెలియజేశారు. అనంతరం ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ టిటిడి హెల్త్‌ విభాగంలో పనిచేస్తున్న 7వేల మంది కార్మికులను తొలగించే కుట్ర చేయడం సరైనది కాదన్నారు. ప్రస్తుతం ఉన్న కార్మికులను తొలగించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారని, 45 సంవత్సరాల లోపు ఉన్న వారిని మాత్రమే పనిలోకి తీసుకోవాలి, అదులోనూ 30 శాతం మహిళలు, 70 శాతం పురుషులు, సూపర్‌వైజర్లుగా శానిటేషన్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారినే తీసుకోవాలని నిబంధనలు తీసుకురావడం దారుణమన్నారు. ఏళ్లతరబడి పనిచేసిన కార్మికులను 45 సంవత్సరాలు పైబడ్డాయని విధులు నుంచి తొలగించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. హెల్త్‌ టెండర్లలో కార్మికుల పొట్టకొట్టే కొత్త నిబంధనలు మార్చాలని 20 రోజుల క్రితం టిటిడి చైర్మన్‌కు వినతిపత్రం ఇచ్చిన అధికారుల్లో చలనం లేదన్నారు. సోమవారం జరిగే టిటిడి పాలకమండలి సమావేశంలో ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, అందుకు కార్మికులు సిపిఎం సంపూర్ణమద్దతు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి.సుబ్రమణ్యం, ఆర్‌.లక్ష్మీ, వేణుగోపాల్‌, బుజ్జమ్మ, వాణిశ్రీ, ఎఫ్‌ఎంఎస్‌ నాయకులు త్యాగ, రఘు, బాలాజీ, పార్ధసారధి, రాజా, రవి, ఏకంబరం, మహిళా కార్మికులు పాల్గొన్నారు.

➡️