తాగునీటి ఎద్దడి నివారణా చర్యలు సిద్ధం : కలెక్టర్‌

తాగునీటి ఎద్దడి నివారణా చర్యలు సిద్ధం : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీ శ పేర్కొన్నారు. కమాండ్‌కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలని, తాగునీటి సరఫరా స్కీముల మరమ్మతు 48 గంటల్లో, హ్యాండ్‌ పంప్‌ మరమ్మతులు 24 గంటల్లో పరిష్కరించాలన్నారు. ప్రతి 15 రోజులకూ తాగునీటి ఎద్దడిపై సమీక్ష ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకం పనుల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల కవరేజి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు, ఉపాధి హామీ పథకం కార్యక్రమం ద్వారా కూలీలకు ఉపాధి పని దినాలు కల్పించడం వంటి అంశాలపై కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ బిల్లులను బుధవారం మధ్యాహ్నం లోపు పెండింగ్‌ లేకుండా అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పంచాయితీ రాజ్‌ శాఖ వారు ర్యాంపులు ఏర్పాటు, మరుగుదొడ్లు, పవర్‌ సప్లై బోర్డులు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పీడబ్ల్యూడి ఓటర్‌ ల కొరకు ఒక వీల్‌ చైర్‌ తప్పక ఉండాలని అన్నారు. జిల్లా తాగునీటి సరఫరా అధికారి విజరు కుమార్‌, పథక సంచాలకులు, డ్వామా శ్రీనివాస రావు, జిల్లా పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి శంకర నారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️