దొంగోట్లతో ‘అధికార’ దర్పం

దొంగోట్లతో 'అధికార' దర్పం

దొంగోట్లతో ‘అధికార’ దర్పంప్రజాశక్తి-తిరుపతి సిటి రాజకీయాలకు రౌడీయుజం తోడయ్యింది. దొడ్డిదారిన అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. గతంలో ఫ్యాక్షనిజం ప్రాంతాల్లో రిగ్గింగ్‌కు పాల్పడేవారు. తాము గెలవలేము అని అంచనా వస్తే బ్యాలెట్‌ బాక్స్‌లో నీళ్లు, ఇంకు పోసేవారు. ఇప్పుడు సాంకేతికపరిజ్ఞానం పెరగడంతో సిసి కెమెరాల నిఘా ఎక్కువ కావడంతో పంథా మార్చారు. పథకం ప్రకారం దొంగోట్లు నమోదు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారానే ఓట్లు నమోదు చేయిస్తూ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పెద్ద కుట్రకు తెరలేపారు. గతంలో జరిగిన అక్రమాలు నిజం అని తేలడంతో ఎట్టకేలకు ఓ ఐఎఎస్‌ అధికారిని బలి పశువును చేశారు. ఆలస్యంగానైనా ఈసి చర్యలు తీసుకోవడంతో అధికారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. త్వరలోనే ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో పై చర్యలు అధికారులకు ఓ రకంగా హెచ్చరికేనని చెప్పవచ్చు. అది 2021 తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు, అధికార వైఎస్‌ఆర్‌సిపి ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయింది. ఆయన స్థానంలో కొత్త సభ్యుని ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. తిరుపతి వైసిపి అభ్యర్దిగా మద్దిల గురుమూర్తిని అధికార పార్టీ ప్రకటించింది. కనీసం 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు. ఇంకేముంది స్థానిక నాయకులు అత్యుత్సాహం చూపించారు. అధికార జులుంను ప్రదర్శించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వేలాది దొంగ ఓట్లను సృష్టించారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి ఎన్నికల రోజు ఓట్లు వేయించారు. ప్రతిపక్షాలు అధికార పార్టీ ఆగడాలను అరికట్టాలని నడుం కట్టి, ఎన్నికల రోజు పలు ప్రాంతాల్లో దొంగ ఓటర్లను స్వయంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై ఎలాంటి చర్యలు లేవు, ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు తరలిస్తున్న బస్సులను పట్టుకుని పోలీసులకు అప్పగించినా కేసులు నమోదు చేసిన పాపాన పోలేదు. అంతా అధికార పార్టీ నాయకుల కన్నుసన్నల్లోనే ఎన్నికలు వారు అనుకున్న రీతిన ముగిశాయి. ఇక ఏముంది 2 లక్షల 72వేల ఓట్లతో ప్రస్తుత తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి తన సమీప అభ్యర్థి టిడిపికి చెందిన పనబాక లక్ష్మీపై గెలుపొందారు. అప్పడు జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పడు చర్యలకు ఉపక్రమించింది. అందుకు బాద్యులను చేస్తూ అప్పట్లో ఆర్‌వోగా వ్యవహరించిన తిరుపతి కార్పొరేషన్‌ కమీషనర్‌ (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌) గిరీషాను దోషిగా చూపిస్తూ సస్పెండ్‌ చేసింది. వాస్తవానికి నిక్కచ్చైన, మంచి అధికారిగా గిరీషాకు పేరుంది. కానీ అధికార పార్టీ నాయకులు స్వార్థానికి బలయ్యారు. తాజాగా కంప్యూటర్‌ ఆపరేటర్లు, డిప్యూటీ తహాశీల్దారులు వంటి కిందస్థాయి ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించారు. కానీ ఇందుకు కారణమైన అధికార పార్టీ పెద్దలు దొరలుగా చెలామణి అవుతున్నారు. ఆ ఎన్నికల్లో గెలుపోటముల అభ్యర్థులను కనీసం వివరణ అడిగిన పాపన పోలేదు. అది కూడా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి అన్న చందానా ఎన్నికలు జరిగి మూడు సంవవత్సరాలు పూర్తవుతున్నప్పడు ఇలా వ్యవహరిస్తే ఎన్నికల కమీషన్‌ అంటే అక్రమార్కులకు ఎలా భయం ఉంటుందో ఆ అధికారులుకే తెలియాలి. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక అనేది మచ్చుక మాత్రమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను అడ్డుకుని, వారిపై దాడులు చేసి, నామినేషన్‌ పత్రాలను చించేచి, నామినేషన్‌ వేసేందుకు వచ్చేవారిని వ్యానులో వేసుకుని సుదూర ప్రాంతాలకు తరలించి నామినేషన్‌ సమయం అయిపోయేలా చేయడం, లేకపోతే పోలీసు స్టేషన్‌లో నిర్భందించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద అధికార దర్పం ప్రదర్శిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు జగమెరిగిన సత్యమే. పైపెచ్చు పారదర్శకంగా అంటూ ప్రకటనలు. ఇక మరీ దారుణమైన విషయం. పట్టాభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలు. వాస్తవానికి ఈ రెండు స్థానాలు కమ్యూనిస్టుల కంచుకోట. ఎలాగైనా ఈ సారి అధికార పార్టీ ఆ స్థానాలు కైవసం చేసుకోవాలని పథకం వేసి అనేక కుట్రలకు పాల్పడిందని ప్రతిపక్షాలు కోడై కూశాయి. దొంగ ఓట్లను సృష్టించారు. ఉపాధ్యాయులను, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు. ఆఖరికి ఐదో తరగతి కూడా చదవని మహిళ పట్టాభద్రుల ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంది. సాక్షాత్తూ మీడియా సాక్షిగా తిరుపతిలో ఈ తంతగాన్ని వెలికితీశారు. అయినా చర్యలు లేవు. చదువుకోని వ్యక్తులు పట్టాభద్రుల ఎన్నికల్లో ఓటర్లుగా మారడం దారుణం. ఇలా ఒకటేమిటి ఎన్నిక ఏదైనా నకి’లీలలు’షరా మామూలే. త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో సైతం వేలాది నకిలీ ఓట్లను అధికార పార్టీ నమోదు చేసిందని, ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి.

➡️