పట్టువిడువక.. పిడికిలై…భిక్షాటన, కళ్లకు నల్లరిబ్బన్లతో నిరసనలు – అంగన్వాడీలతో చెలగాటం వద్దు : ప్రభుత్వానికి సిఐటియు హెచ్చరిక

పట్టువిడువక.. పిడికిలై...భిక్షాటన, కళ్లకు నల్లరిబ్బన్లతో నిరసనలు - అంగన్వాడీలతో చెలగాటం వద్దు : ప్రభుత్వానికి సిఐటియు హెచ్చరిక

పట్టువిడువక.. పిడికిలై…భిక్షాటన, కళ్లకు నల్లరిబ్బన్లతో నిరసనలు – అంగన్వాడీలతో చెలగాటం వద్దు : ప్రభుత్వానికి సిఐటియు హెచ్చరికప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: రాష్ట్రంలో అంగన్వాడీల జీవితాలతో చెలగాటమాడొద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన దీక్షలను ఉద్దేశించి శనివారం నాటి ఉదయం కందారపు మురళి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శించారు. మొదటి రోజున చీఫ్‌ సెక్రటరీ చర్చలలో ఏం మాట్లాడారో… నాలుగవ రోజున కూడా మంత్రుల బందం, చీఫ్‌ సెక్రటరీ కలిసి అదే మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఏదో ఒరగ బెడుతున్నట్టు నాటకమాడుతూ… ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చర్చలు పేరుతో డ్రామాలాడుతున్నారని వేతనాలు పెంచకుండా, గ్రాట్యుటీని ఇవ్వకుండా… ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏమీ కల్పించకుండా సమ్మెను నిలిపివేయమని పదేపదే చెప్పడం… సమ్మెను విచ్ఛిన్నం చేయటానికేనని ఆరోపించారు. పోలీసులను, సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను వినియోగించి అంగన్వాడీ కేంద్రాలను నడపాలనుకోవడం అత్యంత దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అంగన్వాడీలు కోరుతున్న డిమాండ్లు న్యాయమైనవని గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అంగన్వాడీలు ప్రశ్నిస్తూ.. వీధుల్లోకి వచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. అంగన్వాడీలకు తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాల హోరు పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికానికి పరాకాష్టగా ఉందని, ఈధోరణి మానుకోకపోతే వైసీపీకి ప్రజలు గుణపాఠం నేర్పిస్తారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జనసేన నేతలు రాజారెడ్డి, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు బాలసుబ్రమణ్యం, నగేష్‌, రిపబ్లికన్‌ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, టి. సుబ్రమణ్యం, వేణు, మునిరాజా, ఆర్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.. శ్రీకాళహస్తి: టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీకాళహస్తి నియోజక వర్గం పరిధిలో పని చేసే ప్రతి అంగన్వాడీ కార్యకర్తకూ ఇంటి నిర్మాణం కోసం రెండు సెంట్లు భూమి ఇస్తామని ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్‌ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమం శనివారం నాటికి ఐదవ రోజుకు చేరింది. ఈ నిరసన కార్యక్రమానికి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి సంఘీభావం తెలియచేశారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలియచేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించుకుండా అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగుల గొట్టి సచివాలయ ఉద్యోగులచే కేంద్రాలు నిర్వహించడం ఎంతవరకు న్యాయమని బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో అంగన్వాడీలు ఆందోళన కొనసాగించే అన్నిరోజులూ తానే భోజన వసతి కల్పిస్తామన్నారు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ కూడా అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. టీడీపీ నేతలు దశరథాచారి, రంగినేని చెంచయ్య నాయుడు, విజయకుమార్‌, చక్రాల ఉష, సిఐటియు నేతలు అంగేరి పుల్లయ్య, పెరగడం గురవయ్య, గంధం మణి, రాజా, వెంకటేష్‌ పాల్గొన్నారు.గూడూరు టౌన్‌: గూడూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారానికి 5వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు సమ్మె శిబిరం నుంచి పాత బస్టాండ్‌, టవర్‌ క్లాక్‌ సెంటర్‌, గాంధీ మున్సిపాలిటీ బిల్డింగ్‌, ముత్యాల పేట, రాజా వీధి, బజార్‌ వీధి, గాంధీ బొమ్మ, హాస్పిటల్‌ రోడ్‌ వీదుల మీదుగా పుర వీధుల్లో బిక్షాటన చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రజలకు తెలియజేస్తూ నిరసన తెలిపారు. అనంతరం గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి పరిమళ వెంకటేశ్వరరావు, గూడూరు కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు నేదూరు శ్రీనివాసచారి, శిబిరం వద్దకు చేరుకొని సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు తమ పూర్తి మద్దతు తెలిపారు. అలాగే ఆశా వర్కర్లు జిల్లా ఉపాధ్యక్షురాలు కె.ఉష, జిల్లా కమిటీ సభ్యులు, కె.జానకి, ఎస్‌కె.రజియా, పి.గున్నమ్మ, ఇ.హేమ అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. లీడర్లు ఈ.పెంచలమ్మ, కుమారి, మంగమ్మ, సుబ్బమ్మ, రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్‌, సిఐటియు అధ్యక్షులు బివి.రమణయ్య, కార్యదర్శి ఎస్‌.సురేష్‌, మున్సిపల్‌ జిల్లాకార్మిక సంఘం కార్యదర్శి బి.గోపీనాథ్‌, ఏ.ప్రసాద్‌, బి.చంద్రయ్య పాల్గొన్నారు.బుచ్చినాయుడు కండ్రిగ: మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం 5 రోజూ కొనసాగింది. సిపిఎం నాయకులు రమణయ్య, బాల గురువయ్య సమ్మె శిబిరం చేరుకుని వారికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర కమిటీసభ్యులు శోభ, ప్రాజెక్టు కార్యదర్శి కె.సుదర్మన పాల్గొన్నారు.వెంకటగిరి: అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారానికి ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు నల్లరిబ్బన్లు కళ్ళకు కట్టుకొని నిరసన తెలియజేశారు. వీరికి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య, ఎలక్ట్రిసిటీ యూనియన్‌ నాయకులు దందోలు మురళీకష్ణ, కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం నాయకులు ఐలా భాస్కర్‌, సుబ్బరాయులు సంఘీభావాన్ని తెలియజేశారు. ఐసిడిఎస్‌ వెంకటగిరి ప్రాజెక్టు సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.స్వరూపారని, ఎ.మంజుల ఐఎఫ్‌టియు అధ్యక్ష కార్యదర్శులు మమ్ములాబేగం, వరలక్ష్మి, పాల్గొన్నారు.పుత్తూరు టౌన్‌: అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఐదు రోజులుగా సమ్మె కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని శనివారం అంగన్వాడీలు కళ్ళకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలిపారు. పుత్తూరు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా పెట్రోల్‌ బంక్‌ వరకు సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌, ఏఐటియుసి నాయకులు డి.మహేష్‌, దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై.నందయ్య మద్దతు తెలిపారు. పిచ్చాటూరు: 5వ రోజూ సమ్మెను కొనసాగిస్తన్న అంగన్వాడీ వర్కర్లకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. శనివారం పిచ్చాటూరు ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు టిడిపి తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు సతీష్‌ నాయుడు, మండల అధ్యక్షులు తిరుమలరెడ్డి మద్దతు తెలిపారు. అంగన్వాడి వర్కర్ల సమ్మెకు వారి వంతు సాయంగా రూ.5000లు ఆర్థిక సాయం చేశారు.గూడూరు రూరల్‌: ఐదు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించడాన్నీ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శనివారం గూడూరు పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేక్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పూలచంద్రశేఖర్‌, వేమయ్య భాస్కర్‌రెడ్డి, నాగభూషణం, సిద్ధయ్య, మూర్తి పాల్గొన్నారు. నారాయణవనం: అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పి.గిరిబాబు, సుమన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఐదవ రోజు సమ్మె కొనసాగించారు. వారికి మద్దతుగా జిల్లా టిడిపి అధికార ప్రతినిధి నగిరి భాస్కరన్‌, మండల క్లస్టర్‌ ఇన్చార్జి టి.షణ్ముగం, పి.వేలు రెడ్డి, ఎన్‌.పొన్నుస్వామి యాదవ్‌, పిపి.లక్ష్మణన్‌, శరవణ రెడ్డి, శ్రీనివాసులు, జనసేన మండలాధ్యక్షులు సుమన్‌, సముదాయం బూత్‌ఇన్చార్జి డి.ఆరుముగం పాల్గొన్నారు. కోట: స్థానిక అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐదవ రోజు అంగనవాడీల సమ్మె కొనసాగింది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అంగన్వాడీ వర్షంలోనూ గొడుగులతో సమ్మెను కొనసాగించారు. యూనియన్‌ మండల అధ్యక్షురాలు పద్మ లీలమ్మ, సరోజిని మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు సాధనే లక్ష్యం సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేణిగుంట: ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ శనివారానికి 5వ రోజు నిరసన సమ్మె రేణిగుంట మంచినీళ్ళ గుంట పాత ఎమ్మార్వో ఆఫీస్‌ శిబిరం వద్ద కొనసాగింది. అంగన్వాడీ కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని, చేతులెత్తి దండం పెట్టి ‘గోవింద నామం సర్మణ చేస్తూ నిరసన తెలిపారు. జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్‌ వినూత, కోటా చంద్రబాబు, భాస్కర్‌ శిబిరం వద్దకు విచ్చేసి అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపారు. సత్యవేడు: సిఐటియు డివిజన్‌ కార్యదర్శి ఎం.రమేష్‌ ఐదవ రోజూ కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. జనసేన నాయకులు హేమంత్‌ బాష, బాలాజీ, జ్యోతీష్‌ అంగన్వాడీల సమ్మెలకు సంఘీభావం తెలిపారు. గ్రీన్‌ అంబాసిడర్‌ శేఖర్‌, మునిస్వామి, సుబ్రమణి, గోవిందయ్య, భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యదర్శి తిరుమలై రెడ్డి, డివైఎఫ్‌ఐ నాయకులు మురళి మద్దతు తెలిపారు.

➡️