పెద్దిరెడ్డి పై ఆదిమూలం ఫైర్‌

Jan 28,2024 23:04
పెద్దిరెడ్డి పై ఆదిమూలం ఫైర్‌

– ఎంపీ స్థానం కేటాయించడంపై అసంతృప్తి- తిరుపతి ఆత్మీయ సమావేశం నిర్వహించడం పట్ల అసహనంప్రజాశక్తి – పిచ్చా టూరు: సత్యవేడు శాసనసభ స్థానం నుంచి తనను తప్పించి ఎంపీ గురుమూర్తిని సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్టానం నియమించి, తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి సమన్వయకర్తగా నియమించడంతో ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తిగా ఉన్నారు. శనివారం తిరుపతిలో జరిగిన వైసీపీ సత్యవేడు నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనానికి ఆదిమూలం డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో ఆదిమూలం ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదన తెలియజేశారు. తాను సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని, పార్టీలో అందరికన్నా సీనియర్‌గా 14ఏళ్లుగా పాటు నియోజకవర్గంలో 600 గ్రామాల్లో పార్టీని బలపేతం చేశానన్నారు. తన నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే అన్ని చేశానని, తన పాత్ర ఏమీ లేదన్నారు. గ్రావెల్‌, ఇసుకతో సహా అన్ని పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని చెడ్డపేరును మాత్రం తనకు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా ఎంపీ స్థానానికి పంపించారన్నారు. నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా ఆత్మీయ సమయాన్ని తిరుపతిలోనే నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీంతో తన ఆత్మాభిమానం దెబ్బతీసిందన్నారు. ఇతర జనరల్‌ నియోజకవర్గాల్లో ఇలా మీరు చేస్తారా అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. కేవలం దళిత నియోజకవర్గంలోని ఇలా వ్యవహరించడం పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కాదా అని మండిపడ్డారు. మీరు ఎక్కడ సమావేశం పెడితే అక్కడికి నాయకులు రావాలని మీ ఉద్దేశమా? ఇప్పటికీ తనకు పార్టీ అన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్న ఇష్టమని పేర్కొన్నారు. తనమీద అభిమానంతో సీఎం తనకు ఎంపీ స్థానానికి పంపించారని అందుకు ఆయన కతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ ఐదేళ్ల కాలంలో తన వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

➡️