పేదలే సమిథలు..!చెవిరెడ్డి జోలికెళ్లని ‘మఠం’రెవెన్యూపై అనుమానాలు

పేదలే సమిథలు..!చెవిరెడ్డి జోలికెళ్లని 'మఠం'రెవెన్యూపై అనుమానాలు

పేదలే సమిథలు..!చెవిరెడ్డి జోలికెళ్లని ‘మఠం’రెవెన్యూపై అనుమానాలు ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) మఠం భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఫిట్‌ పర్సన్‌, డిప్యూటీ కలెక్టర్‌ రమేష్‌నాయుడు స్వయంగా చెబుతున్నారు. అయితే కబ్జాదారుల నుంచి పేదలు కొనుగోలు చేసిన ఇళ్లపై తన ప్రతాపం చూపారే తప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ పేరుతో 22 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని టిడిపి, జనసేన నాయకుల ఆరోపణలపై అటు మఠం అధికారి గానీ, ఇటు రెవెన్యూ అధికారులు గానీ నోరు మెదిపే పరిస్థితి లేదు. చెవిరెడ్డి లక్ష్మీ పేరుతో ఉన్న భూమిలో ‘మఠానికి సంబంధించిన భూమి’ అని ఎందుకు బోర్డు పెట్టలేదో మఠం అధికారులకే తెలియాలి. పేదల ఇళ్లకు మఠం అధికారులు నోటీసులు ఇచ్చామంటారు.. టిడిపి నేతలు ఇవ్వలేదంటారు.. అసలు మఠం భూముల్లో పేదలు ఇళ్లు కట్టుకుంటుంటే మఠం అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులు ఎందుకు గమ్మునే ఉన్నారు.. మఠం భూముల్లో పంచాయతీ, విద్యుత్‌ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారన్నది అంతుచిక్కని ప్రశ్న. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ రాజకీయం ఏంటన్న చర్చ తిరుపతి రూరల్‌ తుమ్మలగుంటలో నడుస్తోంది. అసలు పేదలకు ఇళ్లను విక్రయించిన కబ్జాదారులు ఎవరు? ఇవన్నీ మిష్టరీగానే మిగిలిపోయే ప్రశ్నలు. ఏమైతేనేం ఎప్పటిలానే పేదలే సమిథలయ్యారు. కష్టపడి చెమటోడ్చి సంపాదించి అంతో ఇంతో కూడబెట్టిన డబ్బుతో కబ్జాదారుల నమ్మకమైన మాటలు నమ్మి మోసపోయారు. చెవిరెడ్డి భూములపై నోరు మెదపరెందుకు? చంద్రగిరి ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచనల మేరకే మఠం అధికారులు పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూలదోశారని, చెవిరెడ్డి భార్య లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూమిపై మఠం అధికారులు ఎందుకు నోరు మెదపలేదని పుదిపట్ల సర్పంచి బడి సుధాయాదవ్‌ ప్రశ్నించారు. బుధవారం తిరుపతి గాంధీరోడ్డులోని హథీరాంజీ మఠం వద్ద పేదలతో కలిసి బైఠాయించారు. పేదల జోలికి రావద్దని, చెవిరెడ్డి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని నినాదాలు చేశారు. తుమ్మలగుంట మఠం భూముల్లో భారీ లావాదేవీలు జరిగాయని, ఆక్రమణకు ప్రేరేపించింది, లావాదేవీలు నడిపించి కాసులు వెనకేసుకున్నది ఎంఎల్‌ఎ కుటుంబేనని విమర్శించారు. తక్కువ ధరకే ప్లాట్లు పేదల చేత కొనిపించి వారికి పన్నులు, విద్యుత్‌ మీటర్లు సిఫార్సు చేసింది ఎంఎల్‌ఎ కాదా? అని ప్రశ్నించారు. తుమ్మలగుంటలోని 100 ఎకరాల్లో ఉన్న చెరువును తన ఇష్టానుసారం భౌగోళిక మార్పులు చేసి తుడా నిధులు 150 కోట్లు వృథా చేశారన్నారు. మఠం భూములు ఎవరూ కొనొద్దు : రమేష్‌నాయుడు గతంలో హథిరాంజీ మఠం భూముల పర్యవేక్షణ లోపం కారణంగానే నేడు పెద్ద ఎత్తున ఆక్రమణలు చోటుచేసుకున్నాయని, ఆ పొరపాటు కారణంగానే నేడు మఠం సిబ్బంది వ్యయ ప్రయాసల మధ్య భూములను స్వాధీనం చేసుకోవాల్సి వస్తోందని మఠం ఫిట్‌ పర్సన్‌, డిప్యూటీ కలెక్టర్‌ రమేష్‌ నాయుడు అన్నారు. బుధవారం తెల్లవారుజామున తుమ్మలగుంటలో హథీరాంజీ మఠంకు చెందిన భూముల స్వాధీనంపై మఠంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. హథీరాంజీ మఠంకు చెందిన భూములు తుమ్మలగుంట పరిధిలోని 7/6, 26/3, 28, 33, 66 నుండి 95, 97, 98, 99, 100, 101 సర్వే నెంబర్లలో దాదాపుగా 165.78 ఎకరాల మఠం భూమి ఉందన్నారు. కొద్దిరోజులుగా సదరు సర్వే నంబర్లలో అనుమతులు లేకుండా అక్రమంగా శాశ్వత నిర్మాణాలను చేపట్టారని, ఫిబ్రవరి నెలలో మఠం సిబ్బంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి హెచ్చరికలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.బుధవారం ఆర్డీవో, రెవిన్యూ సిబ్బంది, పోలీసుల సహాయంతో దాదాపు 40 ఇళ్లను నేలమట్టం చేశామన్నారు. ఇంకా నేల కూల్చాల్సిన అక్రమ కట్టడాలు మిగిలి ఉన్నాయని, ఇంకో పర్యాయంలో వాటిని పూర్తిస్థాయిలో తొలగిస్తామన్నారు. మఠం ఏఈఓ శ్రీనివాసరెడ్డి, లా అధికారిని కవిత పాల్గొన్నారు.

➡️