భాను ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: వైసిపి

భాను ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: వైసిపి ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతిలో అభివద్ధిని అడుగడుగునా అడ్డుకుంటూ తద్వారా రాక్షసానందాన్ని పొందడం బిజెపి నేత భాను ప్రకాష్‌ నైజంగా మారిందని వైసిపి యువజన విభాగం నాయకుడు పసుపులేటి సురేష్‌ అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు జరుగుతుందంటే భాను ప్రకాష్‌ రెడ్డికి నిదుర పట్టదని, నిత్యం తన స్వార్ధ రాజకీయాలకు, స్వార్థ ప్రయోజనాలకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, తిరుపతి నగరపాలక సంస్థను వాడుకుంటూ రాక్షసానందాన్ని పొందుతున్నారన్నారు. డయల్‌ యువర్‌ కార్యక్రమంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అతను శ్రీవారిపై నమ్మకంతో శ్రీవారి సేవ కల్పించాలని అభ్యర్థించడం పట్ల భాను ప్రకాష్‌ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదన్నారు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు కలిగిన ఏ అన్యమతస్తుడైన శ్రీవారి సేవ చేసుకోవడానికి అర్హులని టీటీడీకి చెందిన చట్టాలు చెబుతున్నాయన్నారు. ఒకప్పుడు భాను ప్రకాష్‌ రెడ్డి ఆస్తులు ఎంత, ఇప్పుడు భాను ప్రకాష్‌ రెడ్డి ఆస్తులు ఎంతకు పెరేగాయో దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీకి సంబంధించి అభ్యర్థులు పోటీ చేస్తే లక్షల సంఖ్యలో ఓట్లు ఉన్నా 2 వేలకు మించి ఓట్లు పడడం లేదంటే ప్రజల విశ్వాసం ఎవరు పైన ఉందో భాను ప్రకాష్‌ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. ఇలా ప్రతి విషయంలో భాను ప్రకాష్‌ రెడ్డి అడ్డు తగిలితే రానున్న కాలంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 33 వ డివిజన్‌ కార్పొరేటర్‌ దూది శివ, మద్దాలి శేఖర్‌, టౌన్‌ బ్యాంకు వైస్‌ చైర్మన్‌ వాసు యాదవ్‌, ఆనంద్‌, ముద్ర ప్రసాద్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

➡️