రమణ దీక్షితులను బహిష్కరించాలి: ఉద్యోగుల డిమాండ్‌

రమణ దీక్షితులను బహిష్కరించాలి: ఉద్యోగుల డిమాండ్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)టీటీడీలో తానే ప్రధాన అర్చకుడిగా సర్వం తానై నడిపించాలన్న దురుద్దేశంతో టీటీడీ సొమ్ము తింటూ టిటిడిపై బురద జల్లుతూ తన స్వలాభాలను నెరవేర్చుకుంటున్న రమణ దీక్షితులును వెంటనే విధుల నుండి తొలగించి బహిష్కరించాలని టీటీడీ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకుడు చీర్ల కిరణ్‌ మాట్లాడుతూ శ్రీవారికి జరుగుతున్న కైంకర్యాల విషయంలో పొరబాట్లు జరుగుతున్నాయని రమణ దీక్షితులు ఆరోపించడం తగదన్నారు. ఎన్నికల సమయంలో తన ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక ఎత్తుగడ వేయడం మీడియాలో కనబడటం రమణ దీక్షితులకు పరిపాటిగా మారిపోయిందన్నారు. 80 వేల రూపాయల జీతం తీసుకుంటూ అన్నం పెట్టే టీటీడీపై తన స్వలాభాల కోసం విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. నిత్యం వివిఐపి, వీఐపీల సేవలో తరించే రమణ దీక్షితులు బెంగుళూరు, హైదరాబాదు, తమిళనాడు రాష్ట్రాల్లో విలాసవంతమైన విల్లాల్లో ఉంటూ తనకు టిటిడి కల్పించిన పరపతిని వినియోగిస్తూ సిఫార్సు లేఖలను పంపి ఆయన సేవలో తరించే వారికి స్వామి దర్శనంతో పాటు టిటిడి ప్రసాదాలను పొందుతున్నారన్నారు. రమణ దీక్షితులు పంపే సిఫార్సు లేఖలపై విజిలెన్స్‌ విభాగం పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ కల్పించిన అధికారిక నివాసాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు పవన్‌, గోపి కుమార్‌ రెడ్డి, శివప్రసాద్‌, సునీల్‌ కుమార్‌, ధరణి కుమార్‌, అంకయ్య, బాలకష్ణ పాల్గొన్నారు.

➡️