సర్కార్‌పై నిరసన.. కోటి సంతకాల సేకరణ..శ్రీ భోగి మంటల్లో ఎస్మా ప్రతులు దగ్ధం శ్రీ 33వ రోజుకు అంగన్వాడీల సమ్మె

సర్కార్‌పై నిరసన.. కోటి సంతకాల సేకరణ..శ్రీ భోగి మంటల్లో ఎస్మా ప్రతులు దగ్ధం శ్రీ 33వ రోజుకు అంగన్వాడీల సమ్మె

సర్కార్‌పై నిరసన.. కోటి సంతకాల సేకరణ..శ్రీ భోగి మంటల్లో ఎస్మా ప్రతులు దగ్ధం శ్రీ 33వ రోజుకు అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: చర్చల పేరుతో కాలయాపన చేయడమే కాకుండా అంగన్వాడీలను బెదిరింపులకు గురిచేయటం, ఎస్మాను ప్రయోగించడం వంటి చర్యలను నిరసిస్తూ తిరుపతి నగరంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద శనివారం ఉదయం భోగి మంటలలో ఎస్మా ప్రతులను అంగన్వాడీలు దగ్ధం చేశారు. సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలు తమ సమ్మె శిబిరం వద్ద సంక్రాంతి ముగ్గులను ఆకర్షణీయంగా వేశారు. ముగ్గుల మధ్యలో భోగిని పెద్ద ఎత్తున పేర్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ ఆరుసార్లు చర్చలు జరిపిన ప్రభుత్వం ఎందుకు సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీల సహనానికి పరీక్ష పెడుతున్నారన్నారు. ఈ పోరాటంలో తనది పైచేయిగా ఉండడానికి జగన్మోహన్‌ రెడ్డి ఆరాటపడుతున్నారని, తాను ప్రజలతో వ్యవహరిస్తున్నానన్న స్పహను మర్చిపోయి శత్రువులతో మాట్లాడుతున్నట్టు వైసిపి ప్రభుత్వ వైఖరి ఉందని అన్నారు. పది రోజుల్లో డ్యూటీలలో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కొత్త వారిని ఎంపిక చేస్తామని, ప్రభుత్వం ప్రకటిస్తున్నదని, ఎస్మాని ప్రయోగించారని, అనేక ఇబ్బందులకు గురిచేసారని గుర్తుచేశారు. చర్చల పేరుతో అంగన్వాడీ యూనియన్‌ నేతలను పిలిచి సమస్యల పరిష్కారం కంటే వారిని అవమానం చేసే శాతమే ఎక్కువగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల అనుసరిస్తున్న విధానాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని రాబోయే రోజుల్లో కార్మికులు ప్రత్యక్ష పోరాటాల్లోకి వస్తారని ప్రకటించారు. సమస్యకు ఉన్న తీవ్రత దష్ట్యా సామాన్యుల పట్ల సానుకూలంగా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణను చేపట్టనున్నామని వివరించారు. వీరికి ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఈఎస్‌,కుమార్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ వారి బందం మద్దతును ప్రకటించారు. సిఐటియు నాయకులు టి.సుబ్రహ్మణ్యం, కె.వేణుగోపాల్‌, తంజావూరు మురళి, పార్థసారథి, హరి అంగన్వాడీలు పాల్గొన్నారుశ్రీకాళహస్తి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల అంగన్వాడీ నాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 33వ రోజుకు చేరుకుంది. శుక్రవారం అంగన్వాడీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన మలి దఫా చర్చలు కూడా విఫలం కావడంతో అంగన్వాడీలు భోగి మంటలు, ముగ్గులు వేసే తమ నిరసన తెలియజేశారు. సీఐటీయూ నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గంధం మణి, రేవతి, పుష్ప, సౌజన్య, రాజా, ఐఎఫ్టీయూ నాయకులు సక్కుభాయమ్మ, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.రేణిగుంట: అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం యూనియన్‌ నాయకులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో శనివారం రేణిగుంట మంచినీళ్ళ గుంట పాత ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద అంగన్వాడీలు సమ్మె 32వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు కోటి సంతకాలతో కార్యక్రమాలపైన నాటికలు ప్రదర్శించారు. అనంతరం ఎస్మా జీవోకాపీలను దగ్ధం చేశారు. యూనియన్‌ రేణిగుంట ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ధనమ్మ భాగ్యలక్ష్మి, అంబికా, విజయలక్ష్మీ, సిఐటియు నాయకులు హరినాథ్‌, వెంకట రమణ, సెల్వరాజ్‌, యుటిఎఫ్‌ నాయకులు సురేష్‌, రేణుక మద్దతు తెలిపారు.కోట: అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మలీలమ్మ ఆధ్వర్యంలో సమ్మె శిబిరం వద్ద భోగిమంటల్లో ఎస్మా జీవోకాపీలను దగ్ధం చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు. వెంకటగిరి: అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 33వ రోజుకు చేరింది. శిబిరం వద్ద భోగి మంటలు వేసి ఆ మంటల్లో ఎస్మా చట్టం జీవో కాపీలను అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డీపల్లి చెంగయ్య, యూనియన్‌ అధ్యక్షులు ఏ.మంజుల, కార్యదర్శి స్వరూపరాణి, మండలాధ్యక్షులు సుభాషిని పాల్గొన్నారు. గూడూరు టౌన్‌: పట్టణంలోని అంగన్వాడీలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 33వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరం ముందు వివిధ రకాల రంగులతో సంక్రాంతి ముగ్గుల మధ్య భోగి మంటలు వేసి అందులో ఏస్మా జీవోలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీలు ఏ.ఇంద్రావతి, బిఎస్‌. ప్రభావతి, సిఐటియు నాయకులు బివి.రమణయ్య, ఎస్‌.సురేష్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. సత్యవేడు: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత 32 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలు సత్యవేడులో శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఎస్మా ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేసి నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు రమేష్‌, మురళి, అంగన్వాడీలు నిర్మల, భువన, సరళ, శాంతి పాల్గొన్నారు. పిచ్చాటూరు: సిఐటియు నాయకులు ఎన్‌.నాగరాజు, ఇంద్రరాణి, రాజేశ్వరి, గ్లోరి, సబియా ఆధ్వర్యంలో ఎస్మా ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. పుత్తూరు: పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట 33వ రోజు సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో 33 అంకె ఆకారంతో అంగన్వాడీలు కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం సమ్మె శిబిరం వద్ద రంగురంగుల ముగ్గులు, గొబ్ళిళ్లు పెట్టి భోగి మంటల్లో ఎస్మా ప్రతులను దగ్ధం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌, దళిత గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి వై నందయ్య, మునికుమారి, విజయకుమారి, ధనమ్మ, రాధా, పద్మజ పాల్గొన్నారు. చంద్రగిరి: అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ చేస్తున్న ఆందోళనలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన ఏస్మా నోటీసులను శనివారం భోగి మంటల్లో వేసి దగ్ధం చేస్తూ నిరసన తెలియజేశారు. లక్ష్మి, అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

➡️