సిఎం స్పందించి న్యాయం చేయాలి: భువనేశ్వరి

సిఎం స్పందించి న్యాయం చేయాలి: భువనేశ్వరి

సిఎం స్పందించి న్యాయం చేయాలి: భువనేశ్వరిప్రజాశక్తి- తిరుపతి (మంగళం): పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తానని ఆశ చూపి మంత్రి రోజా తన వద్ద నుంచి రూ.40లక్షలు దశలవారీగా తీసుకున్నారని, ఇప్పుడు పదవి ఇవ్వకపోగా ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లించలేదని పుత్తూరు మున్సిపల్‌ 17వ వార్డు కౌన్సిలర్‌ భువనేశ్వరి ఆరోపించారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల క్రితం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికలలో దళిత రిజర్వేషన్‌ వార్డు కావడంతో వార్డు ప్రజలు తనను ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నిక చేశారన్నారు. ఆ తర్వాత మున్సిపల్‌ ఛైర్మన్‌గా పదవి కోసం మంత్రి రోజాను సంప్రదించగా రూ.70లక్షల అవుతుందని చెప్పారని, తాము అంత ఇవ్వలేమని చెప్పగానే ఆమె తన సోదరుడు కుమారస్వామి దగ్గరకు వెళ్లి మాట్లాడాలని చెప్పారన్నారు. కుమారస్వామి దగ్గరకు వెళ్ళగా ఆయన తన అనుచరుడైన సత్యను తన ఇంటి వద్దకు పంపించడంతో మొదటగా రూ.20లక్షలు చెల్లించామన్నారు. తర్వాత రూ.7, 3, 10 లక్షలు చొప్పున దశలవారీగా మొత్తం రూ.40 లక్షలను ముట్ట చెప్పామన్నారు. కానీ పుత్తూరు మున్సిపల్‌ పరిధిలోని 23వ వార్డులో కౌన్సిలర్‌గా ఎస్సీ జనరల్‌ కేటగిరీలో గెలుపొందిన హరి అనే వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించారన్నారు. రోజులు గడిచే కొద్ది పదవి కోసం మంత్రి ఇంటిచుట్టూ తిరుగుతూనే ఉన్నా పట్టించుకోకపోవడం, ఫోన్‌ సమాచారం పంపిన స్పందించకపోవడంతో తనకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సామాజికవర్గాలకు సమన్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్‌ రెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యేకచొరవ తీసుకొని తన సొమ్ము తనకు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భువనేశ్వరి భర్త సుబ్రహ్మణ్యం, చరణ్‌, రఘువరన్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️