సూర్యప్రభపై శ్రీకాళహస్తీశ్వరుని విహారం

సూర్యప్రభపై శ్రీకాళహస్తీశ్వరుని విహారం

సూర్యప్రభపై శ్రీకాళహస్తీశ్వరుని విహారంప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వారాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు రథంపై అధిరోహించి స్వామి వారిని అనుసరించారు. సూర్యప్రభ వాహనంపై పరమశివుడు విహరిస్తుండగా… మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై స్వామి, అమ్మవార్ల వెంట అనుసరించారు. మిరుమిట్లు గొలిపే రంగుల వలె కొత్త గొడుగులు, పదాతి దళాలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, కోలాటాలు, భజన బందాలు ముందు నడుస్తుండగా… స్వామి, అమ్మ వార్ల పురవిహారం జనరంజకంగా సాగింది. పురవీధుల్లో ఊరేగుతున్న పార్వతీ పరమేశ్వరులను భక్తులు దర్శించుకున్నారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వీ నాగేశ్వరరావు, ఏఈవో లోకేష్‌, సూపరింటెండెంట్‌ నాగభూషణం యాదవ్‌, ఆలయ తనిఖీదారు హరిబాబు యాదవ్‌, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.నేడు రావణాసుర- మయూర వాహనం శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మొత్సవాలలో భాగంగా బుధవారం రావణ బ్రహ్మవాహనంపై పరమేశ్వరుడు మయూర వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పురవీధుల్లో ఊరేగనున్నారు. లంకాధీశుడైన రావణబ్రహ్మపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ స్వామివారు, మయూర వాహనంపై అమ్మవారు కావనున్నారు. కాగా ఉదయం పరమేశ్వరుడు హంస వాహనం పైనా, పార్వతీదేవి యాళి వాహనం పైనా పురవీధుల్లో ఊరేగుతారు.నేడు గాంధర్వరాత్రి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ తిరునాళ్లను గాంధర్వరాత్రిగా పిలుస్తారు. గాంధర్వ రాత్రి అంటే రావణాసురుడు ప్రధాన భూమిక పోషించగా, నారద తుంబర్లతో పాటు గాంధర్వులు సమావేశమై సకల దేవ, భూత గణాల సమక్షంలో పరమేశ్వరుని కీర్తిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారు రావణాసురునిపై, అమ్మవారు మయూర వాహనంపై ఊరేగుతారు.భూత నాథునిపై శివయ్య వైభవం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు గంగాదేవి సమేతుడై భూతవాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై స్వామి వారిని అనుసరించారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప, స్వామి, అమ్మవార్లను అనుసరించారు. అంతకు మునుపు ఆలయంలోని అలంకార మండపంలో పంచమూర్తులకు ఆలయ పురోహితులు విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం పురవిహారానికి తీసుకువచ్చారు. నూతన రాజగోపురం గుండా తేరువీధులోకి ప్రవేశించారు. ఆ తరువాత నెహ్రవీధి, నగరివీధి, బజారువీధి గుండా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భూత, చిలుక వాహనాలపైన పురవిహారం చేస్తున్న శివ, పార్వతులను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యనిర్వహణాధికారి ఎస్వీ నాగేశ్వరరావు, ఆలయ అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

➡️