‘ఓటు’ నమోదుకు 14వ తేదీ డెడ్‌లైన్‌ఆఖరి అవకాశం

'ఓటు' నమోదుకు 14వ తేదీ డెడ్‌లైన్‌ఆఖరి అవకాశం

‘ఓటు’ నమోదుకు 14వ తేదీ డెడ్‌లైన్‌ఆఖరి అవకాశం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)భావి భారత పౌరులుగా దేశ సమగ్ర అభివద్ధిని నిలబెట్టే నాయకుడిని చట్టసభలకు పంపే ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు. ప్రజల జీవితాలను అభివద్ధి బాటలో నడపాలన్నా… దేశ ఆర్థిక పురోగతి చెందాలన్నా మచ్చలేని నాయకుడు, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం తన స్వీయ ఆలోచనలతో తపించే సామాన్యుడిని చట్టసభలకు పంపిస్తే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం దేశంలో కుల మత రాజకీయాలతో రాజకీయ పార్టీలు అధికారం కోసం తహతహలాడే నేపథ్యంలో ప్రజలు మరింత చైతన్యవంతులై బూటకపు వాగ్దానాలు చేసేవారిని నిశితంగా గమనిస్తూ… ప్రజల భవితవ్యాన్ని నిరంతరం గుర్తించి, వారి అభివద్ధికి పాటుపడే వారిని మాత్రమే చట్టసభలకు పంపాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 14 వరకు మాత్రమే ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. యువ ఓటర్లు దేశ భవిష్యత్తులో తమ నైతిక బాధ్యతను వహిస్తూ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. షెడ్యూల్‌ విడుదలైనా….సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ రానుంది. అటు తరువాత నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, తుది ఎంపికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్‌ జరగడానికి జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమవంతుగా ప్రచారాల్లో నిమగమైపోయారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి జిల్లా యంత్రాంగం వివిధ విభాగ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ తలమునకలయ్యింది. ఈ నేపథ్యంలో తేదీ అయితే ప్రకటించారే గాని యువతలో ఓటు నమోదుకు తీసుకోవలసిన అవగాహన కార్యక్రమాలను అధికారులు క్రియాశీలకంగా నడిపించారా అన్న సందేహాలు ఉన్నాయి. జన గణన పరిశీలిస్తే ఇంకను ఓటు నమోదు చేసుకోవలసిన యువత ఉన్నారని తెలుస్తోంది. నవభారత నిర్మాణానికి సారధులుగా చెప్పబడే యువతకు సరైన అవగాహన కల్పిస్తూ ఓటు నమోదు చేయిస్తే పోలింగ్‌ శాతాన్ని పెంచే అవకాశం ఎన్నికల కమిషన్‌ కు ఏర్పడేది. 14వ తేదీ వరకు వచ్చే దరఖాస్తులు మాత్రమే పరిశీలించి ఓటు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పటికే ప్రకటించారు. నేటికి…తిరుపతి జిల్లా పరిధిలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్లు 18,03,211 మందిగా జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఇందులో పురుషులు 8,78,708, స్త్రీలు 9,24,321, ట్రాన్స్‌ జెండర్‌ 182 మంది ఓటు హక్కు పొందినట్టుగా కలెక్టర్‌ వివరించారు. జనాభా నిష్పత్తితో పోలిస్తే ఇంజనీరింగ్‌ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో, గ్రామీణ ప్రాంతాలలో యువ ఓటర్లకు అవగాహన కల్పించడానికి తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్‌ శాతాన్ని నమోదు చేయాలన్నా ఓటరు నమోదు అనేది చాలా కీలకమైనది. జిల్లా యంత్రాంగం దొంగ ఓట్లు పరిశీలన, జాబితా నుండి తొలగింపులు, ఎన్నికల ప్రక్రియ పనులకు పరిమితమైనట్టుగా విమర్శలు ఉన్నాయి. ఓటు నమోదు అయిన వారు….ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్నవారు తమ ఓటు ఏ పోలింగ్‌ బూత్‌ లో ఉందో సరిచూసుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే వారి ఓటు హక్కు కోల్పోవాల్సిన పరిస్థితులు తిరుపతి జిల్లా పరిధిలో నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాల పెంపులో 2019లో వినియోగించుకున్న ఓటు హక్కు తిరిగి అదే కేంద్రంలో వస్తుందనుకోవడం పొరపాటు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ ఓటు లేదని తెలిస్తే ఫారం-6 ద్వారా ఏప్రిల్‌ 14 లోపు నమోదు చేసుకునే అవకాశం ఉంది. చిరునామా మార్చుకోవాలంటే ఫారం-8ని వినియోగించుకోవాలి. ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ యాప్లు ద్వారా ఫారం-6 దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితా(స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌, ఎస్‌ఎస్‌ఆర్‌)ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేసింది. దీనిపై తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఫోన్‌ నెంబర్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. 0866-2236007, 07382700200, 07382700300 నంబర్లకు ఫోన్‌ చేసి ఓటు వివరాలను తెలుసుకునే అవకాశాన్ని జిల్లా అధికారులు కల్పించారు.

➡️