85మంది రక్త(ప్రాణ)దానం..!

85మంది రక్త(ప్రాణ)దానం..!

85మంది రక్త(ప్రాణ)దానం..!ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ పర్స సత్యనారాయణ శతజయంతి పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తిరుపతిలో 38మంది, సత్యవేడు, శ్రీకాళహస్తిలో 12మంది, గూడూరులో 10 మంది, సూళ్లూరుపేట, నాయుడుపేటలో 25 మంది కలిపి మొత్తం 85 మంది రక్తదానం చేశారు. తిరుపతి సిఐటియు కార్యాలయంలో స్విమ్స్‌ బ్లడ్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తెలిపారు. తిరుపతి స్విమ్స్‌ బ్లడ్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది. సిఐటియు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని స్విమ్స్‌ సిఎంఒ డాక్టర్‌ మునస్వామి, బ్లడ్‌బ్యాంక్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీధర్‌బాబు ప్రారంభించారు. డాక్టర్‌ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 14న రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటారని, అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న అని అన్నారు. 18-60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, రక్తం అందక దేశంలో ప్రతిరోజూ దాదాపు పదివేల మంది చనిపోతున్నారని తెలిపారు. డాక్టర్‌ మునస్వామి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వారు రక్తదానానికి అర్హులని, హెపటైటిస్‌ బి, సి, హెచ్‌ఐవి, డయాబెటిస్‌ ఇన్సులిన్‌ తీసుకుంటున్నవారు మినహా అందరూ రక్దఆనం చేయవచ్చన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే శిబిరాన్ని నిర్వహించుటకు అంగీకరించిన స్విమ్స్‌ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌గారికి కృతజ్ఞతలు తెలిపారు. 36 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సురేష్‌బాబు, డాక్టర్‌ జీవన్‌, సిస్టర్‌ ఇందిరమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు జిబిఎస్‌ మణ్యం,టి.సుబ్రమణ్యం, జయచంద్ర, సాయిలక్ష్మి, నగర నాయకులు వేణు, మాధవ క్రిష్ణ, బుజ్జి, తంజావూరు మురళి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో… శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో మెలుగు రమేష్‌, నాగలాపురం నాగరాజు రక్తదానం చేశారు. కార్మికులు శ్రమ చేసే సందర్భంలో ప్రమాదాలు జ రిగిన సందర్భంగా రక్తం లేక ఎన్నో ప్రాణాలుపోతున్నాయని, ఎమర్జన్సీ సమయంలో తమ వారికి రక్తం దొరక్క ప్రజలు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారన్నారు. రక్తదానం చేసిన వారు స్పెషల్‌ లీవ్‌ తీసుకోవచ్చనే నిబంధన ఉందన్నారు. అమ్మ ఫౌండేషన్‌ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. గూడూరు టౌన్‌లో.. ఏరియా ఆస్పత్రిలో సిఐటియు ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బివి రమణయ్య అధ్యక్షతన జరిగింది. రక్తం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదని, ఎవరో ఒకరు రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ జూనియర్‌ కాలేజి వైస్‌ ప్రిన్సిపల్‌ జోగి హరీష్‌కుమార్‌, నాయకులు కె.శశికుమార్‌, వై.కిషోర్‌, జె.కల్యాణ్‌, వైఎస్‌ సురేష్‌, పి.శ్రీనివాసులు, బి.రమేష్‌, అడపాల ప్రసాద్‌ పాల్గొన్నారు. నాయుడుపేటలో.. ప్రభుత్వాసుపత్రిలో సిఐటియు అధ్యక్షులు మమేష్‌బాబు, కార్యదర్శి శివకవి ముకుంద ఆధ్వర్యంలో జరిగింది. రక్తదానంపై అవగాహన కల్పించినపుడే ప్రజలకు అనుకున్నంత మోతాదులో రక్తం దొరుకుతుందన్నారు. నాయకులు ప్రతాప్‌, కుమార్‌, మోహన్‌, ఉదరు పాల్గొన్నారు.

➡️