అడ్మిషన్ల దందా!అడ్వాన్స్‌ బుకింగ్‌ అంటూ పిఆర్‌ఒల హడావిడి అదేదారిలో ప్రయివేటు పాఠశాలల కాన్వాసింగ్‌కార్పొరేట్‌ విద్యాసంస్థలపై విద్యాశాఖ నిర్లక్ష్యం

అడ్మిషన్ల దందా!అడ్వాన్స్‌ బుకింగ్‌ అంటూ పిఆర్‌ఒల హడావిడి అదేదారిలో ప్రయివేటు పాఠశాలల కాన్వాసింగ్‌కార్పొరేట్‌ విద్యాసంస్థలపై విద్యాశాఖ నిర్లక్ష్యం

అడ్మిషన్ల దందా!అడ్వాన్స్‌ బుకింగ్‌ అంటూ పిఆర్‌ఒల హడావిడి అదేదారిలో ప్రయివేటు పాఠశాలల కాన్వాసింగ్‌కార్పొరేట్‌ విద్యాసంస్థలపై విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రజాశక్తి-తిరుపతి” మేడం…! భార్గవ్‌ .. మీ అబ్బాయేగా. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో పాసయ్యాడు. అందుకే వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం. ఇంటర్‌లో మంచి కళాశాలలో చేర్పిస్తేనే మీ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మా కళాశాలలో కొంచెం ఫీజు ఎక్కువైనా నాణ్యమైన విద్యను అందిస్తాం. ఇంటర్‌తో పాటే ఎంసెట్‌కు ప్రత్యేక తర్పీదును ఇస్తాం. అంతే కాదు ఐసి, ఎసి బ్యాచ్‌లనూ రన్‌ చేస్తున్నాం. రెండు దశాబ్దాలుగా రాష్ట్ర స్థాయి ర్యాంకులన్నీ మావే. ఒకవేళ ఈ ప్రభుత్వమూ ర్యాంకులను ప్రకటించి ఉంటే అత్యుత్తమ ర్యాంకులన్నీ మావే. ఇదిగో మా కళాశాల ప్రత్యేకతలతో కూడిన బ్రోచర్‌ను చూడండి. మాకున్న పేరు రాష్ట్రంలో ఏ విద్యాసంస్థకూ లేదు. సాధారణ విద్యార్థులను సైతం స్టేట్‌ ర్యాంకర్‌లుగా తీర్చిదిద్దిన ఘనత మా కళాశాలదే. ఇప్పడు మీరు తొందరపడకుంటే మళ్లీ మా కళాశాలలో సీటు దొరకడం అంత సులభం కాదు. పైగా ఇప్పుడే అడ్వాన్స్‌ బుకింగ్‌ ( రిజిస్ట్రేషన్‌) చేసుకుంటే మీకు ప్రత్యేక రాయితీ ఇస్తాము. ప్రస్తుతానికి రూ. 2 వేలివ్వండి. మిగిలింది పిల్లాడిని చేర్పించేటప్పుడు చెల్లిస్తే చాలు. ఇదిగో దరఖాస్తు ఫారం. వీటిని నింపి సంతకం పెట్టండి ” – ఇదీ తిరుపతిలో ఓ ప్రముఖ కార్పొరేట్‌ కళాశాల పిఆర్‌ఓల హడావుడి ” సార్‌..!. మీ ఇంట్లో బడి ఈడు పిల్లలున్నారా… ఉంటే మా పాఠశాలలోనే చేర్పించండి. ఎల్‌కేజీ నుంచీ 10 తరగతి వరకూ మా పాఠశాల పిల్లలందరూ ఇంగ్లీషులోనే మాట్లాడేలా మేం తయారు చేస్తాం. మా పాఠశాలలో ఒకటో తరగతి నుంచే కంప్యూటర్‌ చదువులు చెప్పిస్తాం. ఇంగ్లీషులోనే గడగడా మాట్లాడించేస్తాం. మిగతా బడుల్లో ఉన్న అయ్యోర్లకంటే 10 రెట్లు బాగా చదువు చెప్పే టీచర్లు మా పాఠశాలలో ఉన్నారు. ఐదంతస్తుల పెద్ద భవనంలో స్కూల్‌ను ఏర్పాటు చేశాం. రానుపోను బస్సు సౌకర్యం ఉంది. ప్రత్యేకంగా కంప్యూటర్లు, ల్యాబ్‌, ప్లేగ్రౌండ్‌ ఉన్నాయి. తెల్లారి 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు నిర్వహిస్తాం. పదో తరగతికి అయితే స్పెషల్‌ క్లాసులు, స్టడీ అవర్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ శిక్షణతో పాటు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపుతాం. ఈ కారణంగానే మా పాఠశాల విద్యార్థులు ప్రతిఏటా అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు. నర్సరీ నుంచి 10 తరగతి వరకు మా పాఠశాలదే అన్నింటా అగ్రస్థానం. మీకు మీ పిల్లల భవిష్యత్తే ముఖ్యమని భావిస్తే, కొంత ఎక్కువ ఖర్చయినా ..వారి బాధ్యత మాకు అప్పగించండి” – ఇదీ మంగళంలో ఓ కార్పొరేట్‌ పాఠశాల యాజమాన్యం కాన్వాసింగ్‌ వేసవి సెలవులు ఇంకా ముగియనే లేదు. ప్రయివేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాలు విద్యార్థుల్ని, వారి తల్లితండ్రుల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల తల్లితండ్రుల వెంటపడుతూ వారికి గాలం వేసేందుకు సిద్దమవుతున్నారు. పిఆర్‌ఓలను నియమించుకుని ఇంటింటికీ తిప్పుతూ తమ కళాశాలల్లో ఉన్నవీ లేనివీ అన్నింటినీ కలిపి విస్తృత ప్రచారం చేస్తున్నారు. రంగురంగుల బ్రోచర్స్‌ తో విద్యార్థుల తల్లిదండ్రుల్ని మభ్యపెడుతున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ అంటూ ఇంటర్‌లో అడ్మిషన్లను చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు పెద్దఎత్తున కమీషన్‌లు ఇచ్చి వారి ద్వారానే విద్యార్థుల తల్లితండ్రులకు ‘ పలానా కళాశాలలో చదువు బాగా చెబుతారు. మేము మీకు రెకమండ్‌ చేస్తాం. ఫీజుకూడా తగ్గించేలా చూస్తాము ‘ అని చెప్పించి , తద్వారానూ అడ్మిషన్లను చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి ఆ కళాశాలలో చేరిన తర్వాత గానీ పిఆర్‌ఓలు తొలుతగా చెప్పిన ఫీజుకు, ఆయా కళాశాలలు వసూలు చేస్తున్న ఫీజులకు ఏమాత్రం సంబంధంలేదన్న విషయం తెలియడం లేదు. ఇక చేసేది లేక విద్యార్థుల తల్లితండ్రులూ కార్పొరేట్‌ కళాశాల అడిగినంతా ఇవ్వకతప్పడం లేదని వాపోతున్నారు. పాఠశాలల స్థాయిల్లోనూ ప్రయివేటు యాజమాన్యాలు పోటీలు పడి మరీ ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల్ని తమ వైపుకు తిప్పుకునేందుకు పెద్దఎత్తున కాన్వాసింగ్‌ చేస్తున్నారు.ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలపై చర్యలు తీసుకోవాలి : రవి, ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా పదో తరగతి పరీక్షలు ముగియకుండానే కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ యాజమాన్యాలు పెద్దఎత్తున కాన్వాసింగ్‌ చేస్తూ వచ్చింది. ఇప్పుడేమో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలోనూ టీచర్లకు టార్గెట్‌లను ఇచ్చి మరీ అడ్మిషన్లను చేస్తున్నారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్దమని అటు డిఇఒ, అటు ఆర్‌ఐఒలకూ తెలుసు. ఇలాంటి విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు రాతపూర్వకంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశాం. అయినా స్పందన లేదు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలేమో బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాటిపై చర్యలు తీసుకోకుంటే విద్యాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచించి విద్యార్థులను కళాశాలలో చేర్పించాలి. కార్పొరేట్‌ యాజమాన్యాలు పెట్టే మార్కుల ప్రలోభాలకు లొంగకుండా వాస్తవంగా ఆలోచించి, మంచి కళాశాల, పాఠశాలల్లో చేర్పించాలి.

➡️