శ్రీకాళహస్తిలో కోడ్‌ ఉల్లం’ఘనులు’

శ్రీకాళహస్తిలో కోడ్‌ ఉల్లం’ఘనులు’ప్రజాశక్తి-శ్రీకాళహస్తి సాధారణ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికారులు కోడ్‌ ఉల్లంఘనలపై నిఘా పెట్టారు. కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అయితే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మాత్రం ప్రతిరోజూ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయ ఇఓగా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి ఉన్నారు. సుదీర్ఘకాలం రెవెన్యూలో పనిచేశారు. ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలు చేపట్టిన అనుభవం కూడా ఉంది. ఎన్నికల కోడ్‌ గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అయినా ఉల్లంఘన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో నాయకులు పాల్గొనకూడదు. నాయకులతో కలిసి ఇఓ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బోర్డు కార్యాలయానికి రావడం, అధికారులు, సిబ్బందితో చర్చించడం, పనులు పరిశీలించడం, ప్రారంభోత్సవాలు చేయడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనేది ఎన్నికల అధికారులు తేల్చాల్సి ఉంది. రిటర్నింగ్‌ అధికారైన ఆర్డీవో స్థానికంగానే ఉన్నారు. ప్రతిరోజు పత్రికల్లో, టీవీల్లో నాయకులు పాల్గొన్న కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి. అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనేది రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేయాల్సి ఉంది.

➡️