అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్‌

May 22,2024 21:55
అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్‌

ప్రజాశక్తి- క్యాంపస్‌: సార్వత్రిక ఎన్నికలు -2024 ప్రక్రియలో భాగంగా జూన్‌ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్‌లో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్వైజర్లు, కౌంటింగ్‌ సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఎఆర్‌ఓలు, కౌంటింగ్‌ సూపర్వైజర్లకు, సహాయకులకు, మైక్రో అబ్జర్వర్స్‌లకు జూన్‌ 4వ తేదీన జరిగే కౌంటింగ్‌ విధానంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జూన్‌ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు- 2024 ఓట్ల లెక్కింపు విధానంలో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్విజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు కీలక పాత్ర వహించి కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలని తెలిపారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఒక పార్లమెంటు, అసెంబ్లీకి సంబంధించిన ఏడు నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు విధులు కేటాయించబడిన సంబంధిత అధికారులు అందరు ఈవీఎం, వీవీ ప్యాట్‌లు, ఓట్ల లెక్కింపుల గురించి హ్యాండ్‌ బుక్‌ని క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుని కౌంటింగ్‌ నిర్వహణలో ప్రముఖపాత్ర వహించాలని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలలో కౌంటింగ్‌ సూపర్వైజర్‌లు వారి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలలో టేబుల్స్‌ ఏర్పాట్లును, భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్‌ విధులు కేటాయించిన సిబ్బంది యొక్క మొబైల్‌ ఫోన్లు కౌంటింగ్‌ సెంటర్లోకి అనుమతి లేదని తెలిపారు. కౌంటింగ్‌ విధులు కేటాయించబడిన సిబ్బంది ఉదయం 7గంటలకు అందరూ కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని, ఎలాంటి అలసత్వం వహించరాదని అన్నారు. ఓటర్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందని ఆర్వోలు అందరూ కౌంటింగ్‌ ముందుగానే నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను సరిచూసుకోవాలని తెలిపారు. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై కూడా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించి కౌంటింగ్‌ నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ సమయంలో వీడియో కవరేజ్‌ చేపట్టడం, కౌంటింగ్‌ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలన ఉంటుందన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల పార్టీ ఏజెంట్లు కూడా కచ్చితంగా గుర్తింపు కార్డులు ధరించాలని తెలిపారు. కౌంటింగ్‌ విధులు కేటాయించిన సిబ్బందికి తాగునీరు, భోజన సౌకర్యం కల్పించాలని తెలిపారు. కౌంటింగ్‌ అనంతరం ఈవీఎం, వీ వీ ప్యాట్‌లు, పటిష్టమైన బందోబస్తు ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌లోకి చేర్చేలా ఆయా నియోజకవర్గాల ఆర్వోలు సిద్ధంగా ఉండాలన్నారు. జెసి ధ్యాన చంద్ర, మునిసిపల్‌ కమిషనర్‌ అదితి సింగ్‌, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు, రిటర్నింగ్‌ అధికారులు నిశాంత్‌ రెడ్డి రవిశంకర్‌ రెడ్డి, చంద్రముని, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, నియోజకవర్గాల ఆర్వోలు పాల్గొన్నారు.

➡️