రుయాలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యంప్రతిపాదనలకు వైద్యశాఖమంత్రి ఆదేశాలు

Jun 17,2024 23:12

రుయాలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యంప్రతిపాదనలకు వైద్యశాఖమంత్రి ఆదేశాలు ప్రజాశక్తి -తిరుపతి సిటీ రుయాలో సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వై. సతీష్‌ కుమార్‌ అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొట్టమొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుని, బాధ్యతలను స్వీకరించి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం తిరుమలకు కుటుంబ సమేతంగా ఆదివారం విచ్చేశారు. శ్రీవారి దర్శనానంతరం సోమవారం రుయా ఆస్పత్రి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రుయా ఆసుపత్రి లోపల మొదటగా అత్యవసర విభాగ వార్డును ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను అక్కడ అందుతున్న వైద్యం గురించి, వైద్యులు వైద్యం అందిస్తున్న తీరును గురించి, నర్సింగ్‌ సిబ్బంది నాలుగో తరగతి సిబ్బంది వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఓపి విభాగానికి వెళ్లి ఓపి చీటీలు పొందే దగ్గర ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా? అని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందుతోందని, మందులు అందుబాటులో ఉన్నాయని రోగులు చెప్పారు.జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో ఇన్‌పేషంట్‌, రోగి సహాయకులతో ముచ్చటించారు. ఎండాకాలంలో కొద్దిపాటి నీటి సమస్య ఉందని తెలిపారు. రుయాలో ప్రైవేట్‌ ఆస్పత్రుల కన్నా మెరుగ్గా వైద్యం అందుతుందని తెలిపారు. రుయాలో రేడియాలజీ డిపార్టుమెంట్‌ను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్య ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, తిరుపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీహరితో రుయా ఆస్పత్రి అభివృద్ధిపై చర్చించారు. రుయాలో సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, టిడిపి నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, సుగుణమ్మ, నరసింహయాదవ్‌ పాల్గొన్నారు.

➡️