క'(ని)మ్మ’ని ధర

Apr 27,2024 00:30

క'(ని)మ్మ’ని ధరప్రజాశక్తి- డక్కిలిధర ఉంటే కాయ ఉండదు… కాయ ఉంటే ధర ఉండదు… ఈ చేదు నిజం రైతు గుండెల్ని పిండిచేస్తోంది.. మండలంలో సుమారు 3వేల హెక్టార్లలో నిమ్మ సాగవుతోంది. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నిమ్మ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో నిమ్మ సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వెంకటగిరి , గూడూరు నిమ్మ మార్కెట్లలో నిమ్మకాయలు కేజీ ధర నాణ్యతను బట్టి రూ 60 నుంచి రూ 120 వరకు పలికింది. మండలంలో నిమ్మ సాగు చేసే రైతులు తమ దిగుబడులను గూడూరు , వెంకటగిరి నిమ్మ మార్కెట్లకు తరలిస్తుంటారు. సాధారణంగా నిమ్మ ధరలు మార్చి ఏప్రిల్‌ , మే, మాసాల్లో ఆశాజనకంగా ఉంటాయి. అయితే గత నెల చివరి వారంలో హోలీ పండుగ నేపథ్యంలో ధరలు తగ్గి 20 రోజులుగా అంతంత మాత్రం గానే ఉన్నాయి. నాలుగు రోజులుగా ధరలు రోజురోజుకూ పెరిగి శుక్రవారం మంచి నాణ్యత కలిగిన నిమ్మకాయలు కేజీ రూ 120 పలికింది. ఈ ప్రాంతం నుంచి 40 కేజీల బస్తాల్లో రైతులు గూడూరు, వెంకటగిరి నిమ్మ మార్కెట్లకు తమ దిగుబడులను ఎగుమతి చేస్తుంటారు. ఆ బస్తా రూ ఐదు వేల వరకు రావడంతో రైతులకు పెరిగిన ధరలు ఊరటనిస్తున్నాయి. తోటలో దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడం, గణనీయంగా పెరిగిన ఎండల ప్రభావంతో మైట్స్‌ వంటి తెగుళ్ల ఉధతి, పెరిగిన సాగు ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు నిమ్మ సాగు చేసే రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

➡️