ఏపీకి అన్యాయం చేసిన మోడీ.. కేడీ..

Jan 29,2024 10:16
ఏపీకి అన్యాయం చేసిన మోడీ.. కేడీ..

ప్రజాశక్తి- తిరుపతి(మంగళం) : ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షురాలుగా మొదటిసారి తిరుపతికి వచ్చిన వైఎస్‌ షర్మిల రెడ్డి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తనదైన శైలిలో ఎండగడుతూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల స్పందించారు. ఆదివారం తిరుపతి నగర పరిధిలోని రామతులసి కళ్యాణ మండపం వేదికగా తిరుపతి, చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు, జగన్‌ తమ స్వలాభాల కోసం ఏపీ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారని అన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభంతో దేశంలో భక్తి చాటుతున్న మోడీ తిరుపతి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన మాటను తప్పిన కేడీ అయ్యారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్‌ షర్మిల రెడ్డి అనే నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకే ప్రజల్లోకి వచ్చానని తెలిపారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చి ఉంటే వేల సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉండేదని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేదన్నారు. రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు మోడీకి బానిసలుగా మారిపోయారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమి చేశాడని మోడీకి చంద్రబాబు, జగన్‌ బానిసలుగా మారిపోయారో ప్రజలకు చెప్పాలన్నారు. వైసీపీకి ఓటు వేసిన, పొత్తులతో వస్తున్న టిడిపి, జనసేన పార్టీలకు ఓటు వేసిన బిజెపికి ఓటు వేసినట్టేనని, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెలవలేని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంపై అజమాయిషీ చలాయిస్తోందని, ఇందుకు కారణం బానిసలుగా మారిన టిడిపి, వైసిపిలేనని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఏపీకి అమరావతి రాజధాని అని కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూపిన వ్యక్తి ఒకరైతే, ఒకటి కాదు మూడు రాజధానులు కావాలని చెప్పి నేడు రాష్ట్రానికి రాజధాని లేకుండా మరొకరు చేశారని విమర్శించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారి ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ముందుండి పోరాడుతానని షర్మిల హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ చింతా మోహన్‌ మాట్లాడుతూ షర్మిలమ్మకు ఉన్న సమయస్ఫూర్తి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డికి కూడా లేదని, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి షర్మిలే అన్నారు. జగన్‌ దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా మిగిలిపోయాడని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల నాయకత్వంలో రాహుల్‌ నేతత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ హాయంలో రాజకీయంగా ఖ్యాతి పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా నేడు వైఎస్‌ఆర్‌ వ్యతిరేకులుగా మారిపోయి జగన్‌ చేస్తున్న దుర్మార్గపాలనకు వంత పాడుతున్నరని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివద్ధి చెందాలంటే వైఎస్‌ షర్మిలతో సాధ్యమన్నారు. కార్యక్రమంలో జెడి శీలం, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, ఏఐసిసి శాశ్వత సభ్యులు గిడుగు రుద్రరాజు, రాంభూపాల్‌ రెడ్డి, పాల్గొన్నారు.

➡️