అసంపూర్తిగా నాడు -నేడు పనులు

Jun 17,2024 21:06

 ప్రజాశక్తి- మెరక ముడిదాం : పాఠశాలల్లో నాడునేడు పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. మండలంలో సుమారు 73 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలు తొమ్మిది, ఎంపిపిఎస్‌ పాఠశాలలు ఏభై రెండు, ఎంపి యుపి పాఠశాలలు తొమ్మిది, మోడల్‌ పాఠశాల ఒకటి, కెజిబివి ఒకటి, ఎయిడెడ్‌ ఒకటి ఉన్నాయి. ఈ పాఠశాలలు సమూలాంగా మార్పు తీసుకొచ్చి కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా నిర్మాణం చేపట్టి, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా గత ప్రభుత్వం నాడు -నేడు పనులు చేపట్టింది. అయితే చివరి దశకు వచ్చేసరికి మండలంలో సుమారు 21 పాఠశాలల్లో ఈ పనులు వివిధ దశలలో ఆగిపోయాయి. మండలంలోని పలు పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులు నిధులు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మెరకముడిదాం కెజిబివి, బుధరాయవలస, గర్భాం, గరుగుబిల్లి, ఎస్‌ కొర్లామ్‌, ముడిదాం ఎస్‌సి, మర్రివలస, పాండ్రంకి పేట, ఎస్‌ పూతికావలస, రామాయవలస, సింగవరం, చినబంటుపల్లి, రాచపేట, ఊటపల్లి, ఎన్‌ బుధరాయవలస ప్రాథమిక పాఠశాలల్లో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. బైరిపురం, బిల్లలవలస, గరుగుబిల్లి, గోపానవలస, శాతం వలస జెడ్‌హెచ్‌ఎస్‌ పాఠశాలల్లోనూ నిర్మాణాలు నిలిచిపోయాయి. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పాటు ఇసుక, సిమ్మెంట్‌ కొరత పనులు నిలుపుదలకు కారణంగా తెలిస్తోంది. ఇప్పటికే బిల్లలవలస, బైరిపురం పాఠశాలలో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని త్వరలో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు, అధికారులు చెబుతున్నారు. అయితే నూతనంగా ఏర్పడిన ఎన్‌డిఎ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న పాఠశాలల అదనపు భవనాలపై దృష్టి సారించి పూర్తి చేస్తుందా లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు. విద్యార్థుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️