కానరాని ఇంకుడు గుంతలు

May 25,2024 20:52

 పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు

అడుగంటుతున్న నీటి వనరులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : వేసవి నేపథ్యంలో నగరంలో జలఘంటికలు మోగుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా తాగునీటి సమస్యను పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ప్రస్తుతం చాలా బోర్లు పనిచేయడం లేదు. నగరంలో సుమారుగా అన్ని ప్రాంతాల్లో ఈ ఇబ్బందులున్నాయి. 300 మీటర్ల పైబడి లోతు వరకు మోటార్లు దింపినా నీరందడం లేదు. మరోవైపు ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసి భూగర్భ జలాన్ని పెంచుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్య ల్లేవు. వీటి ఏర్పాటు విషయంలో ప్రజలకు సరైన అవగాహన లేదు. గత ఐదేళ్లుగా నుంచి వీటి నిర్మాణాల ఊసే లేదు. ఇంటి నిర్మాణం,అపార్ట్మెంట్లు నిర్మాణం కోసం దరఖాస్తు చేసినప్పుడే ఇంకుడు గుంతల కోసం నిర్దేశించిన రుసుమును చలానా రూపంగా చెల్లించాలి. నిబంధన ప్రకారం 200 చదరపుమీటర్లు దాటిన ప్రతి నిర్మాణానికి తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాలి. అపార్టుమెంట్లు అయితే ప్రతి 10 యూనిట్లకు రెండు చొప్పున ఇంకుడు గుంతలు నిర్మించాలి. గతంలో ఒక్కో దాని కోసం నగరపాలక అధికారులు రూ.1200 తీసుకునే వారు. అనంతరం తనిఖీ చేసి వాటి నిర్మాణం చేపట్టేవారు. భవన యజమానులే కాకుండా సంస్థ సైతం కొన్నింటిని నిర్మించాల్సి ఉంది. ఈమేరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలి.నిరుపయోగంగా నిధులు మూడేళ్ల క్రితం పట్టణ ప్రణాళికా విభాగం సహకారంతో వివిధ ప్రాంతాల్లో 704 ఇంకుడు గుంతల్ని నిర్మించాలని భావించారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధిత బాధ్యతలను అప్పగించారు. ఒక గుంతకు సుమారు రూ.10 వేలు అవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. అప్పట్లో రూ.30 లక్షలతో 240 వరకు మాత్రమే నిర్మించారు. కొన్ని అపార్టుమెంట్లలో స్థలం లేక పోవడం, కొన్ని చోట్ల నిర్మాణాలకు యజమానులు అంగీకరించడం లేదనే సాకుతో అధికారులు చేతులెత్తేశారు. ఈ విధంగా రూ.80 లక్షల నిధులను పక్కనపెట్టినట్లు ఆరోపణలున్నాయి. నిర్మా ణాల్లోనూ లోపాలు కనిపించాయి. ప్రస్తుతం అవన్నీ నిరుప యోగంగా ఉన్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న బోరుకు ఏడాదంతా నీరు అందాలంటే ఇంకుడు గుంతలు తప్పనిసరి అని నిపుణులు సైతం చెబుతున్నారు. 250 గజాల నుంచి 500 గజాల స్థలం ఉన్న ఇంటి ఆవరణలో నాలుగు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవు, 9 అడుగుల లోతు ఉండేలా గుంత తీయాలి. దీనికి నలువైపులా అడుగు భాగంలో ఎక్కడా సిమెంటు ప్లాస్టరింగ్‌ చేయకూడదు. చిన్న స్థలం ఉన్న దగ్గర ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతులోనూ నిర్మించొచ్చు. వర్షపునీరు అందులోకి చేరేలా చూసుకోవాలి. ఒక్క వర్షాకాలంలోనే ఓ కుటుంబానికి 3 సంవత్సరాల వరకు సరిపోయే నీటిని సేకరించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయినా ఇంకుడు గుంతల విషయంలో పట్టించుకున్న దాఖలాలు లేవు.మరో వైపు అపార్ట్మెంట్లలో కనీసం మట్టి కనిపించకుండా మొత్తం ప్లాస్టింగ్‌ చేయడంతో నీరు కనీసం నిల్వ ఉండే పరిస్తితి లేదు. ఇప్పటికే నగరంలో నీటి ఇబ్బందులు అధికంగా ఉన్నా వీటిపై దష్టి సారించకపోవడం అధికారులు, పాలకుల తీరుకు నిదర్శనం. ఇప్పటికైనా మేలుకోకపోతే భవిష్యత్‌ లో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

➡️