వాసిరెడ్డి కుటుంబం.. రాజకీయాలకు దూరం

Apr 21,2024 22:16

 ప్రజాశక్తి-బొబ్బిలి :  2009లో నియోజకవర్గాల పునర్విభజనలో తెర్లాం నియోజకవర్గాన్ని తొలగించిన విషయం తెలిసిందే. తెర్లాం నియోజకవర్గ పరిధిలోని తెర్లాం, బాడంగి మండలాలను బొబ్బిలి నియోజకవర్గంలో విలీనం చేశారు. దీంతో వాసిరెడ్డి కుటుంబం రాజకీయాలకు దూరమైంది. తెర్లాం నియోజకవర్గంలో వాసిరెడ్డి, తెంటు కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధం జరిగేది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాసిరెడ్డి వరద రామారావు, తెంటు జయప్రకాశ్‌ మధ్య హోరాహోరీగా పోటీ ఉండేది. బొబ్బిలి నియోజకవర్గంలో తెర్లాం విలీనం కావడంతో 2009లో జరిగిన ఎన్నికల్లో తెంటు జయప్రకాశ్‌ కుమారుడు తెంటు లక్ష్మునాయుడుకు టిడిపి టికెట్‌ ఇచ్చింది. అప్పటి మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరద రామారావుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకుండా.. అప్పటికే బొబ్బిలి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు టికెట్‌ ఇచ్చింది. బొబ్బిలి నియోజకవర్గ రాజకీయాల్లో తెంటు లక్ష్మునాయుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. కానీ, వాసిరెడ్డి కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాలలో క్రియాశీలకంగా పనిచేయడం లేదు. బొబ్బిలిలో విలీనం అనంతరం వాసిరెడ్డి కుటుంబం పూర్తిగా నియోజకవర్గంలో ప్రభావం కోల్పోయి, సొంత గ్రామం పినపెంకి రాజకీయాలకు పరిమితమైంది. 1978, 1999 ఎన్నికల్లో వాసిరెడ్డి వరద రామారావు, 1983, 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో తెంటు జయప్రకాశ్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2008 జనవరిలో తెంటు జయప్రకాశ్‌ మరణించడంతో తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు తెంటు లక్ష్మునాయుడు విజయం సాధించారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి తెంటు లక్ష్మునాయుడు టిడిపి అభ్యర్థిగా 2009, 2014లో పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. వాసిరెడ్డి రామారావు మరణం తర్వాత ఆయన కుమారుడు పినపెంకి రాజకీయాలకు పరిమితమయ్యారు.

➡️