చిన్న శ్రీనా..? బెల్లానా?

Jan 12,2024 21:26

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: విజయనగరం ఎమ్‌పి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖరా..? జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావా (చిన్న శ్రీను)?… ఇంతకీ ఎవరు? ఇదీ జిల్లాలో సాగుతున్న ఆసక్తికర చర్చ. తనకు సిఎం నుంచి హామీ ఉందని, తప్పకుండా తనకే సీటు దక్కుతుందని బెల్లాన చెబుతున్నారు. ఇప్పటికే చిన్న శ్రీనుకు ఎంపీ టిక్కెట్‌ ఖరారైందని ఆయన ఆనుచరులు, అభిమానులు చెప్పుకుంటు న్నారు. అధిష్టానం మాత్రం సీటు కేటాయింపు విషయం వెల్లడించేందుకు తటపటాయిస్తోంది. ఇందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో బొబ్బిలి మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. చిన్న శ్రీను ఈసారి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీచేయాలనే తలంపుతో ఉన్నారు. ముందు నుంచీ అనుకున్నట్టు బొబ్బిలిలో స్థానిక ఎమ్మెల్యేను మార్పుచేసినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో చిన్నశ్రీనుకు అవకాశం ఉండదని చాలా కాలంగా చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిన్న శ్రీనుకు ఎమ్‌పి సీటు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. అలా అయితే సిట్టింగ్‌ ఎంపీ బెల్లాన భవితవ్యం ఏమిటి అనేది ప్రశ్న. వీరిద్దరిలో ఒకరికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే సీట్లు, మరొకరికి విజయనగరం ఎంపీ సీటు ఇస్తారని కూడా చర్చనడుస్తోంది. అటు ఎచ్చెర్ల స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ను ఈసారి పక్కనబెడితే ఈ ఫార్మలా బాగానే అమలు అయ్యే అవకాశం ఉంది. కానీ, కిరణ్‌ను తప్పనిసరిగా పక్కనబెడతారనేది సందేహమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎంపీ సీటు యథాతథంగా బెల్లానకు ఇచ్చేస్తే చిన్న శ్రీను సంగతి ఎలా ఉంటుందనేది ప్రశ్న. చిన్న శ్రీను జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎంపీ టిక్కెట్‌ కట్టబెడితే అసెంబ్లీ స్థానాలన్నీ కలుపుకుని ఎన్నికల గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తారని పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా జిల్లా పార్టీకి నాయకత్వం వహిస్తున్న చిన్న శ్రీనుకి ఈ ఎన్నికల్లో సముచిత స్థానం కూడా కట్టబెట్టినట్టుగా ఉంటుందని పార్టీ యోచిస్తోంది. కానీ, బెల్లాన ప్రభావం చీపురుపల్లి నియోజకవర్గంతో ముడిపడి ఉంది. ఒక వేళ బెల్లానను పక్కనబెడితే ఎన్నికల్లో పార్టీకి పనిచేస్తారా? ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఆఫర్‌ ఇస్తే అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా తలపడుతున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ కోణాల్లో పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మంత్రి బొత్స కూడా ఇదే సందేహంతో ఉన్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇలా ఓవైపు జిల్లాను ఏకతాటిపై నడిపిస్తున్న చిన్న శ్రీనుకి అవకాశం ఇవ్వాలా? లేక ప్రస్తుతం ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వానికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉద్యమాలను మాటలగారడితో చల్లారుస్తున్న సీనియర్‌ మంత్రి బొత్స భవితవ్యం చూడాలా? అన్నది వైసిపి అధిష్టానం ముందు ప్రస్తుతం సవాలుగా నిలిచింది. అందువల్లే అటు శ్రీకాకుళం ఇటు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించినప్పటికీ విజయనగరం అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

➡️