టిడిపి కేడర్లో అయోమయం

Mar 1,2024 20:25

ప్రజాశక్తి – జామి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి కేడర్‌లో అయోమయం నెలకొంది. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు గాను ఇటీవల ఐదు నియోజకవర్గాల్లో టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. చీపురుపల్లి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధానంగా ఎస్‌.కోట టిక్కెట్‌పై సందిగ్ధతో నెలకొంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ గ్రూపులుఉన్నాయి. వీరిలో ఎవరికి టిక్కెట్‌ వస్తుందోనన్న సందిగ్ధం కార్యకర్తల్లో నెలకొంది. వీరి ఇరువురూ టిక్కెట్‌కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.ఒకవైపు సీనియర్‌ నాయకులుగా నందమూరి కుటుంబానికి ఎంతో సన్నిహితమైన కోళ్ల కుటుంబానికి టిక్కెట్‌ ఖాయమని ఆ గ్రూపు నాయకులు చెబుతుంటే.. కాదు కాదు.. ఎన్నారైగా టిక్కెట్‌ ఆశిస్తున్న గొంప కృష్ణకే టిక్కెట్‌ దాదాపుగా ఖరారైందని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. జామి మండలంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి టిక్కెట్‌ వస్తే వేరే గ్రూపు సహకరిస్తుందా లేదా? అనే డైలామా నెలకొంది. రాజకీయ కురువద్ధుడు లడుగు సింహాద్రి లేకపోవడం మండలంలోని తెలుగు తమ్ముళ్లకు దిశా నిర్దేశం చేసే నాయకత్వం లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిడిపి, అభిమానులు, నాయకులు గందరగోళానికి గురవుతున్నారు. గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి, టిడిపి, జనసేన పొత్తులో భాగంగా కొండపల్లి శ్రీనివాస్‌ కు టిక్కెట్‌ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కెఎ నాయుడు.. శ్రీనివాస్‌ అభ్యర్థిత్వం పట్ల గుర్రుగా ఉన్నారు. నియోజక వర్గంలో జామి మండలానికి చెందిన 12 పంచాయతీల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు గత పదేళ్లుగా కెఎ నాయుడుతో ఉన్నారు. వీరంతా శ్రీనివాస్‌కు ఏమేరకు సహరిస్తారో వేచి చూడాల్సి. కొండపల్లి శ్రీనివాస్‌ అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఒకసారి తన ఓటమికి తన ఇంటి మనుషులే కారణమని భావిస్తున్న కె ఎ నాయుడు, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి అన్న కుమారుడు శ్రీనివాసకు మద్దతు తెలుపుతారా అన్నది ప్రశ్నార్ధకమే. పార్టీ నిర్ణయానికి కట్టుబడి మాజీ ఎమ్మెల్యే మాటను పక్కను పెట్టి, తెలుగు తమ్ముళ్లుశ్రీనివాస్‌కు ఏమేరకు సహకరిస్తారో వేచి చూడాలి.

➡️