తక్షణమే సంక్షేమ ఫలాలు

Feb 19,2024 21:14

ప్రజాశక్తి-రాజాం : అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి, వాటి ఫలాలను తక్షణం అందించడమే తమ ప్రభుత్వ విధానమని విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజాం పట్టణంలోని ఆదర్శనగర్‌, డోలపేటల్లో ఒక్కోటి రూ.80 లక్షలతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, రూ.1.08 కోట్లతో నిర్మించిన సబ్‌ ట్రెజరీ కార్యాలయ భవనాన్ని, రూ.కోటిన్నరతో నిర్మించిన రాజాం బస్‌ కాంప్లెక్స్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు. బస్‌ కాంప్లెక్స్‌ వద్ద జరిగిన సభలో బొత్స మాట్లాడుతూ సుమారు ఆరు నెలల్లోనే బస్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేసినందుకు అభినందించారు. త్వరలో రాజాంలో బస్‌ డిపో కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులు తమను, తమ ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించడానికి పరిమితం కాకుండా, ప్రజల కోసం ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని, పెద్దా చిన్నా తేడా చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు. అనంతరం కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడారు. కార్యక్రమాల్లో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు, జోనల్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ గదల బంగారమ్మ, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ తలే రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి : గొర్రెలు, మేకల పెంపకం దారులు 699 మందికి రూ.24 లక్షలు విలువైన వలలు, టార్చ్‌ లైట్లు, రెయిన్‌ కోట్లను చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పంపిణీ చేశారు. జిల్లా పరిషత్‌ నుంచి సుమారు రూ.16.70 లక్షలు సమకూర్చగా, మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించారు. వత్తిదారులకు సహకార రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ రకాల కుల వత్తులను సంరక్షించడానికి, వత్తిదారులను ఆదుకోవడానికి కషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు, మేకల పెంపకం దారులకు ఉపకరణాలు పంపిణీ చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ జెడి డాక్టర్‌ విశ్వేశ్వరరావు, డిడి డాక్టర్‌ వై.వి.రమణ, ఎంపిపి ఇప్పిలి వెంకట నరసమ్మ, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష పాల్గొన్నారు.

➡️