తగ్గారా..? తగ్గించారా..?

Mar 17,2024 21:11

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్‌పిగా పోటీచేయాలని ఎంతో ఆశగా, ఆతృతగా ఎదురు చూసిన జిల్లా పరిషత్తు చైర్మన్‌, వైసిపి జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కల నెరవేరలేదు. చివరి క్షణాల్లో శ్రీనే వెనక్కి తగ్గి పోయారా? లేక పార్టీనే వెనక్కి తగ్గించిందా? ఇదీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఆయన అనుయాయులు, అభిమానులు మాత్రం పార్టీ అధిష్టానం వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకనాడు మంత్రి బొత్స సత్యనారాయణ… నేడు అదే స్థాయిలో చిన్న శ్రీను అన్నట్టుగా గడిచిన దశాబ్ద కాలంలో వైసిపిని ఒంటిచేత్తో నడిపించారు. బొత్స జోక్యం ఉన్నా లేకపోయినా ఓవైపు నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ, మరోవైపు పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. అందుకు తగ్గట్టే గత ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని స్థానాలు వైసిపికి వచ్చాయి. నాటి విజయంలో చిన్న శ్రీను పాత్ర తక్కువేం కాదు. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. రాష్ట్ర స్థాయి పార్టీ కార్యక్రమాల్లో సైతం చిన్న శ్రీనుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే 2024లో అసెంబ్లీ లేదా పార్లమెంట్‌కు వెళ్లాలనే ఆశ అడుగడుగునా కనిపించేది. ఈసారి ఎలాగైనా చిన్న శ్రీను ఎమ్‌పి లేదా ఎమ్మెల్యేగా పోటీచేస్తారనే చాలా మంది రాజకీయాలకు అతీతమైన వ్యక్తులు సైతం భావించారు. అనుకున్నట్టే రెండు నెలల క్రితానికి బొబ్బిలి లేదా ఎచ్చెర్ల నుంచి రంగంలో దింపుతారనే ప్రచారం గట్టిగానే నడిచింది. అందుకు సామాజిక సమీకరణాలు అనుకూలించకపోవడంతో విజయనగరం ఎమ్‌పిగా పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వచ్చాయి. ఒకానొక దశలో విశాఖపట్నం ఎమ్‌పిగా బొత్స ఝాన్సీలక్ష్మిని ప్రకటించినప్పుడే విజయనగరం ఎమ్‌పి టికెట్‌ చిన్న శ్రీనుకు ఖాయమైందని కూడా చర్చ నడిచింది. సిట్టింగ్‌ ఎమ్‌పి బెల్లానకు ప్రత్యామ్నాయం చూపుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ, శనివారం ప్రకటించిన జాబితాలో చిన్న శ్రీను పేరు కనిపించలేదు. చిన్న శ్రీనుకు టికెట్‌ లేకుండా చేయడం కోసం మంత్రి బొత్స తన రాజకీయ పలుకుబడితో సిట్టింగులను యథాతథంగా కొనసాగించేందుకు అధిష్టానాన్ని ఒప్పించారని ప్రచారం ముమ్మరంగా నడుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీనుకు ఎమ్‌పి లేదా ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే, ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్తు చైర్మన్‌ పదవికి ఎన్నికలకు ముందుగానే రాజీనామా చేయించాలనే మెలిక కూడా పెట్టారట. జిల్లా అడ్మినిస్ట్రేషన్‌, రాజకీయాలను శాసించేందుకు అనువుగా ఉన్న జెడ్‌పి పీఠాన్ని వదులుకునేందుకు ఇష్టం లేక చిన్న శ్రీనే వెనక్కి తగ్గారని చర్చ నడుస్తోంది. పార్టీ జిల్లా సమన్వయకర్తగా ప్రస్తుత ఎన్నికల్లో అత్యంత కీలకంగా పనిచేయాల్సింది శ్రీనే. కాబట్టి, పార్టీ ఉత్తరాంధ్ర డిప్యూటీ కోఆర్డినేటర్‌ పదవి ఇచ్చి పార్టీ సంతృప్తి పర్చిందని పలువురు విశ్లేషిస్తున్నారు. పోటీకి అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడం, అందుకు జిల్లాకు చెందిన నేత అడ్డపడ్డారన్న ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల్లో శ్రీను పాత్ర ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

➡️