నిరుద్యోగులను మభ్యపెడుతున్న ప్రభుత్వం

Feb 5,2024 20:47


ప్రజాశక్తి-విజయనగరంకోట : షో వర్క్‌ డిఎస్‌సిని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెడుతోందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక కోట వద్ద మెగా డిఎస్‌సి ప్రకటించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. దీనికి తెలుగు యువత, నిరుద్యోగ జెఎసి సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని హామీనిచ్చి నిలువునా మోసగించారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్కసారీ జాబ్‌ కేలండర్‌ విడుదల చేయలేదన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టడానికి అత్యవసరంగా కేబినెట్‌ పెట్టి 6 వేల డిఎస్‌సి పోస్టులను మాత్రమే ప్రకటించిందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్‌సి కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం ప్రకటించిన పోస్టులు ఏకోసాన పరిపోతాయని ప్రశ్నించారు. అనంతరం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ సిద్ధిక్‌ మాట్లాడుతూ 23 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్‌ అధ్యక్షులు వి.చైతన్య బాబు, టిడిపి జిల్లా కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, నాయకులు వేచలపు శ్రీనివాసరావు, రాజేష్‌ బాబు, కనకల మురళీమోహన్‌ పాల్గొన్నారు.

➡️