నేటి నుంచి ఆడుదాం ఆంధ్రా

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : జిల్లాలో మంగళవారం నుంచి ఆడుదాం ఆంధ్రా పేరిట భారీ క్రీడా సంబరం ప్రారంభం కానుంది. సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిల్లో జరిగే ఈ పోటీల్లో వందలాది మంది క్రీడాకారులు పాల్గొనేందుకు రంగం సిద్దమైంది. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విజేతలకు స్పోర్ట్స్‌ కిట్లు, మెమెంటోలు, నగదు బహుమతులు ఇవ్వనున్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, ఖోఖో, కబడ్డీ క్రీడాంశాల్లో మంగళవారం నుంచీ జిల్లా వ్యాప్తంగా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గత నెల 20 నుంచి తమ పేర్లను సచివాలయాల్లో రిజిష్టర్‌ చేయించుకున్నారు. ఇలా ఇప్పటికు వరకు సుమారుగా లక్షా, 42 వేల, 728 మంది క్రీడాపోటీలకు ముందుకు వచ్చారు. ఇప్పటికీ కూడా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్దపడే వారికి అవకాశాన్ని కల్పించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, ఖోఖో, కబడ్డీ క్రీడాంశాల్లో ఈ పోటీలు జరుగుతాయి. క్రీడల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం, వీటిపై ఇప్పటికే విస్తత ప్రచారాన్ని నిర్వహించింది. ప్రతీ గ్రామంలో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. జట్లుగా ఆడే క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో పోటీలకు ఇప్పటివరకు 12188 జట్లను ప్రత్యేక యాప్‌ ద్వారా రూపొందించారు. మిగిలిన క్రీడాకారులు వ్యక్తిగత పోటీల్లో తలపడతారు. పోటీలకు అవసరమైన సుమారు 20,296 క్రీడా పరికరాలను ఆయా గ్రామాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 342 క్రీడా మైదానాల్లో పోటీలు జరగనున్నాయి. జిల్లాలోని 626 సచివాలయాల పరిధిలో క్రీడాపోటీలు జరగనుండగా, వీటి నిర్వహణలో సహకరించేందుకు 6,260 మంది క్రీడా వాలంటీర్లను ఎంపిక చేశారు. వీరందరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసి, అవసరమైన పరికరాలను అందజేశారు. కొంతమంది ఉత్సాహవంతులైన క్రీడాకారులు ఒకటి కంటే ఎక్కువ క్రీడల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మ్యాచ్‌లు జరగనున్నాయి. డిసెంబరు 26 నుంచి జనవరి 9 వరకు సచివాలయ స్థాయిలో, జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఆసక్తి ఉండి 15 ఏళ్లు పైబడిన వారికి ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. ప్రతి సచివాలయం పరిధిలో క్రీడా మైదానాలను ఇప్పటికే సిద్దం చేసి, క్రీడా సామగ్రిని తరలించారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతి ఉంటుంది. సచివాలయ స్థాయిలోని విజేతలకు స్పోర్ట్స్‌ కిట్లను బహుమతిగా ఇస్తారు. క్రీడాకారులకు మైదానం వద్దే భోజన సదుపాయాన్ని కల్పించారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ పర్యవేక్షణలో విద్యాశాఖ, పంచాయితీరాజ్‌, వైద్యారోగ్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో యువజన సర్వీసుల శాఖ ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తోంది.
ఆడుదాం ఆంధ్రా పోటీల వివరాలు
పోటీలు జరగనున్న సచివాలయాలు : 626
స్పోర్ట్స్‌ వలంటీర్లు : 6260
క్రీడా మైదానాలు : 342
క్రీడా పరికరాలు : 20,296
పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు : 142728
పురుషులు : 75873
స్త్రీలు : 27505
మొత్తం జట్లు : 12188
మహిళల జట్లు : 3592
పురుషుల జట్లు : 8596

➡️