పదవీ యావలు… ప్రజా సమస్యలు

Jan 13,2024 20:16

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఓవైపు పుట్టెడు సమస్యలతో ప్రజానీకం. మరోవైపు పదవులే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికార ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులు. ఎన్నికల ముందైనా తమ సమస్యలు పరిష్కరించకపోతారా? అని ఆశ చూస్తున్న ఉద్యోగులకు నిరాశే ఎదురౌతోంది. ఉన్న హామీలు నెరవేర్చలేదు సరికదా అధికార పార్టీ నాయకులు కొత్తకొత్త హామీలతో ముందుకు వస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలుకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? అని నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకులూ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు లేదా ఎన్నికల అనంతరం నామినేటెడ్‌ పదవుల హామీల కోసం అధినేతల వద్ద ఎగబాకుతున్నారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు వంటి స్కీమ్‌ వర్కర్లు, సర్వశిక్షాభియాన్‌లోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఇలా పలు రంగాలకు చెందిన వారంతా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తునే ఉన్నారు. వీరితో చర్చిస్తున్న ప్రభుత్వం కంటితుడుపు హామీలు తప్ప, వారి జీవనంతో ముడిపడివున్న ఆర్థికపరమైన అంశాలను నెరవేర్చడం లేదు. మరోవైపు ధాన్యం రైతులు తాము నిలువ దోపిడీకి గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాధులు కనిపించడం లేదు. ఎపి రైతు సంఘం నాయకులు మాత్రమే వారి తరపున అధికారులను కలిసి విన్నపాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వీరి సమస్యలను అవగతం చేసుకుని ప్రభుత్వానికి తెలియజేసి, సమస్యల పరిష్కారానికి అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయడం లేదు. టిడిపికి చెందిన నాయకులు కేవలం ఆందోళన చేస్తున్న వారికి సంఘీ భావం తెలియజేడం తప్ప ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి రోడ్లపైకి రావడం లేదు. వైసిపి నాయకులు ఓ అడుగు ముందుకేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటుచేసి వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. టిడిపి నాయకులు శిబిరాల వద్దకు వెళ్లి, వైసిపి చేయనివన్నీ తాము అధికారంలోకి వచ్చాక చేసేస్తామంటూ ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. దీంతో, ఇటు టిడిపి నాయకులుగానీ, అటు వైసిపి నాయకులుగానీ పదవుల కోసం తప్ప ప్రజాసమస్యలపై పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదని జనం చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఎం, సిఐటియు నాయకులు మాత్రమే కార్మికులు, ఉద్యోగులు, ప్రజల తరపున నిఖరంగా ఉన్నారంటూ చర్చ జరుగుతోంది.

➡️