రైతులేమైనా ఇంజినీర్లా?

Feb 23,2024 20:56

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ అలైన్‌మెంట్‌ మార్పు చేయాల్సిన అవసరం లేదు… మార్పుచేయాలని చెప్పడానికి రైతులేమైనా ఇంజినీర్లా?. నీరు ఎలా వెళ్లాలో… కాలువ ఎలా నిర్మించాలో ఇంజినీర్లకు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం చేసినప్పుడు భూములు త్యాగం చేయక తప్పదు.. అలా అయితే కదా పంట భూములకు సాగునీరు అందేది’… అంటూ జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తేల్చిచెప్పారు. జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కొప్పలవెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వైసిపి హయాంలోనూ, అంతకు ముందు మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే జరిగాయని తెలిపారు. టిడిపి ఏమీ చేయకపోయినా ప్రాజెక్టులు నిర్మించినట్టుగా గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ఈ సందర్భంగా సుజల స్రవంతి కాలువ అలైన్‌మెంట్‌ మార్పుచేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనపై వైసిపి వైఖరి ఏమిటని ‘ప్రజాశక్తి’ ప్రశ్నించగా ‘రైతులేమైనా ఇంజినీర్లా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు చేపట్టినప్పుడు భూములు సేకరించడం సహజమని, అందుకు రైతులు సహకరించాల్సి ఉంటుందని చెప్పారు. సుజల స్రవంతి కాలువ నిర్మాణంలో తమ పార్టీకి చెందిన నెక్కల నాయుడుబాబు స్వగ్రామంలోని భూములు కూడా పోతున్నాయన్నారు. ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించామని ‘ప్రజాశక్తి’ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పచ్చ మీడియాకు కనిపించదా? అంటూ ఓ పత్రికనుద్దేశించి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విత్తనాల విక్రయం మొదలుకుని, పంట కొనుగోలు వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా సాగుతోందన్నారు. ఈ ఏడాది మునుపెన్నడూ లేనంగా ధాన్యం సేకరించడంతోపాటు చెల్లింపులు జరిగాయన్నారు.

➡️