సమస్యల పరిష్కారం కోసంఆశావర్కర్ల నిరవధిక ధర్నా

Dec 14,2023 22:09

విజయనగరం టౌన్‌    :  ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరవధిక ధర్నా, వంటావార్పు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో ఆశా వర్కర్లు కలెక్టరేట్‌కు చేరుకుని, ధర్నాలో పాల్గొన్నారు. ఆశావర్కర్ల ఆందోళనకు సిఐటియు మద్దతు తెలియజేసింది. ధర్నానుద్దేశించి ఆశావర్కర్ల యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బి.సుధారాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడుతూ ఆశా వర్కర్లపై పనిభారం పెంచి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పని భారాన్ని తగ్గించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మొబైల్‌ వర్క్‌ శిక్షణ ఇవ్వాలని, రికార్డ్‌ లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా ఒకే పని చేయించాలన్నారు. 10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షలు ఇవ్వాలని కోరారు. వేతనంలో సగం పింఛను ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 62 ఏళ్ల రిటైర్మెంట్‌ జిఒ వర్తింపజేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రెటరీ నియామకాల్లో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం శిబిరం వద్ద వంటావార్పు చేసి, అక్కడే భోజనాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి.వి.రమణ, జిల్లా నాయకులు యుఎస్‌ రవికుమార్‌, ఆశా వర్కర్లు యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎల్‌.శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️