డిప్యూటీ డిఇఒ పోస్టుల ఆన్‌లైన్‌ పరీక్షకు 1470 మంది అభ్యర్థులు

May 24,2024 21:21

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : ఎపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిప్యూటీ డిఇఒల నియామకం కోసం శనివారం నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షకు అభ్యర్థులంతా అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత చెప్పారు. పరీక్షకు 1470 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై డిఆర్‌ఒ శుక్రవారం తన ఛాంబరులో సమీక్షించారు. జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్ష శనివారం ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్ధులను ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించరని స్పష్టంచేశారు. రాజాంలోని జిఎంఆర్‌ఐటిలో 300 మంది, చింతలవలసలోని ఎంవిజిఆర్‌ కళాశాలలో 250 మంది, భోగాపురం మండలంలోని అవంతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 170 మంది, బొబ్బిలిలోని స్వామి వివేకానంద ఇంజినీరింగ్‌ కళాశాలలో 90 మంది, గాజులరేగ వద్దనున్న సీతం కళాశాలలో 150, అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో 510 మంది పరీక్షకు హాజరు అవుతున్నట్టు తెలిపారు. రాజాంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థ విజయనగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి ఉదయం 5.30, 6 గంటలకు ప్రత్యేక బస్‌ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్‌ ఫొటో గుర్తింపుకార్డు తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎపిపిఎస్‌సి అధికారులు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

➡️