22వ రోజుకు మిమ్స్‌ ఉద్యోగుల నిరసన

Feb 22,2024 20:42

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ హెచ్చరించారు. మిమ్స్‌ ఉద్యోగుల 22వ రోజు పోరాటం సందర్భంగా మిమ్స్‌ హాస్పిటల్‌ నుంచి రామతీర్థం జంక్షన్‌ వరకు గురువారం పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.వి.రమణ మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యం లేబర్‌ అధికారులు నిర్వహించే చర్చలకు రాకుండా కార్మిక చట్టాలను, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందన్నారు. ఉద్యోగులను తల్లిదండ్రుల వలే చూసుకుటున్నాం అంటున్న యాజమాన్యం నేటికీ జనవరి నెల జీతం ఇవ్వకపోవడం పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. రేపు విశాఖపట్నంలో జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ వద్ద జరిగే చర్చల్లో సమస్య పరిష్కారం కోసం చర్చలకు వస్తే మంచిదని, లేబర్‌ అధికారుల ముందు సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. ముందుకు రాకపోతే గ్రామాల నుంచి కుటుంబ సభ్యులతో సహా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సిటిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడుతూ యాజమాన్యం అబద్దపు ప్రచారాలు మానుకోవాలన్నారు. ఒకవైపు కార్మికులను ఇబ్బంది పెడుతూ మరొకవైపు ప్రజలకు సరైన వైద్యం అందించకుండా, విద్యార్థులకు విద్య అందకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మిమ్స్‌ యాజమాన్యం చట్టాన్ని దిక్కరించి 7 డిఎలు బకాయిలు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకుండా నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి వీడి చర్చలకు వచ్చి ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు మిరప నారాయణ, కర్రోతు కాము నాయుడు, మహంతి నాగభూషణం, మధు, మూర్తి, రాంబాబు, గౌరీ, వరలక్ష్మి, రామకృష్ణ, బంగారునాయుడు, నాగేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️