కొట్టుకుపోయిన కాజ్‌వే

Jun 17,2024 20:58

ప్రజాశక్తి-బొబ్బిలి రూరల్‌ : మండలంలోని పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన కాజ్‌వే కొట్టుకుపోయింది. పారాది వంతెన కుంగడంతో రూ.94 లక్షలతో నిర్మించిన కాజ్‌ వే నిర్మించారు. వరద నీరు పోయేందుకు ఖానాలు ఏర్పాటు చేసినప్పటికి సిమెంట్‌ కాంక్రీటుతో నిర్మించలేదు. మెటల్‌తో నింపేసి, దానిపై బిటి రోడ్డు నిర్మించారు. సోమవారం వేగావతి నది వరదనీటి ఉధృతికి కాజ్‌వే కొట్టుకుపోయింది. సిమెంట్‌ కాంక్రీటుతో కాజ్‌వే నిర్మించకపోవడం వల్లే వరద ఉధృతికి కొట్టుకుపోయిందని విమర్శలు వస్తున్నాయి. కాజ్‌ వే కొట్టుకుపోవడంతో ద్విచక్ర వాహనాలు, కార్లను పాత వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతించారు. భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భారీ వాహనాలను దారి మళ్లించడంతో రవాణా ఖర్చులు భారం కావడంతోపాటు సమయానికి గమ్యానికి చేరుకోలేకపోతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన వంతెన నిర్మాణం చేపట్టి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

➡️