ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటాం.

Dec 13,2023 16:01 #Vizianagaram
anganwadi protest 2nd day vzm protest

బెదిరింపులకు భయపడేది లేదు
సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. జగన్మోహన్రావు వెల్లడి..
రెండో రోజుకి చేరిన అంగన్వాడీలు నిరసన దీక్ష
మద్దతు తెలియజేసిన రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు.
ప్రజశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే తగ్గేదే లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. జగన్మోహన్రావు తెలిపారు. రెండవ రోజు సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలునే అంగన్వాడీలు అమలు చేయమంటున్నారని, ప్రభుత్వం స్పందించలేదు కాబట్టే తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం కావలసి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కరించాలని, అలా కాదని ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడితే అంగన్వాడీలు తగ్గేదే లేదని ‌ గత పాలకులకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు.‌‌ జనసేన పార్టీ నాయకులు రామచంద్ర రాజు, ఆదాడ మోహన్రావు,‌ ఏ ఐ ఎఫ్ టి యు, ఇఫ్టు,ఐద్వా,డి వై ఎఫ్ ఐ జిల్లా, రాష్ట్ర నాయకులు బెహరా శంకర్రావు, అప్పలసూరి, రవణమ్మ,లక్ష్మి, సుధారాణి, రుద్ర ప్రసాదులు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తున్నామని తెలిపారు. ధరలు మండిపోతుంటే రూ”1.50/- లు పిల్లాడికి ఏ విధంగా నాణ్యమైన భోజనం అందిస్తారని ప్రశ్నించారు. ఐసిడిఎస్ అందిస్తున్న సరుకుల్లో నాణ్యత లేదని , లబ్ధిదారులకు అందిస్తున్న వాటిలో బల్లులు, బొద్దింకలు, పురుగులు బయటపడుతున్నాయని, గుడ్లు కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం లో చదువు చెబుతామన్న జగన్మోహన్ రెడ్డికి పిల్లల్ని సంరక్షిస్తూ,ప్రాథమిక స్థాయిలో చదువు పట్ల అవగాహన కల్పిస్తున్న అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు జీతం పెంచి ఇస్తామన్న వాగ్దానం చేశారా! లేదా ! చెప్పండన్నారు. తెలంగాణలో వర్కర్ కి 13600/-, హెల్పర్ కి 7850 ఇస్తున్నారని , దీనికి అదనంగా వెయ్యి రూపాయలు కలిపి రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుటి, పెన్షన్ ,రిటైర్మెంట్ బెనిఫిట్స్, వంటి సమస్యల కోసం అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించారు. జనసేన పార్టీ తరఫున 18000/- జీతం కోసం పోరాడుతామని హామీ ఇచ్చారు.. అంగన్వాడి వర్కర్స్ &హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడ్రాజు మాట్లాడుతూ ఐసిడిఎస్ రక్షణ కోసం, ఉద్యోగ భద్రత కోసం మేము చేస్తున్న పోరాటాన్ని బలపరిచిన ప్రజా సంఘాలకు రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిన రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ , ఉద్యోగ సంఘాలు మా ఈ పోరాటానికి మద్దతు తెలియజేయాలని పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈరోజు కార్యక్రమంలో ప్రభ, విశాలాక్షి, శివలక్ష్మి ,మంగ లక్ష్మి, ప్రసన్న, జయ, లలిత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

➡️