బిఎన్‌ఎస్‌ చట్టాన్ని రద్దుచేయాలి

Jul 1,2024 20:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డ్రైవర్లను క్రిమినల్స్‌ను చేస్తూ ఐదేళ్లు జైలు శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారత న్యాయ సంహిత చట్టం 106 (1,2) లను తక్షణమే నిలిపివేయాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు ఎ. జగన్మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. స్థానిక కోట జంక్షన్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు బిఎన్‌ఎస్‌ చట్టాన్ని నిలిపి వేస్తున్నట్లు మోడీ ప్రకటించి , 3 వ సారి అధికారంలోకి రాగానే జూలై 1 నుంచి అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూటికి 90శాతం మంది రవాణా రంగంలో ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ గా సొంత వాహనాలు నడుపుతున్నారని, వారందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా పోరాడుతుంటే స్పందించని మోడీ డ్రైవర్లను క్రిమినల్స్‌ చేసే చట్టం మాత్రం సంఘాలు, సంస్థలు అభిప్రాయం తెలుసుకోకుండా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టాన్ని అమలు చేయకుండా నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి. రమణ, ఉపాధ్యక్షులు త్రినాథ్‌, ఆటో యూనియన్‌ నాయకులు శ్రీను, నర్సింగరావు , తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.రామభద్రపురం : కేంద్ర ప్రభుత్వం జులై నుంచి అమలు చేస్తున్న భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని సోమవారం స్థానిక మూడు రోడ్లు జంక్షన్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు, మండల కార్యదర్శి బలస శ్రీను మాట్లాడుతూ ఐపిసి బదులు బిఎన్‌ఎస్‌ అమలు చేయడం దారుణమన్నారు. బిఎన్‌ఎస్‌ చట్టం అమలు చేస్తే ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి, ఎవరైనా మరణిస్తే డ్రైవర్‌ తప్పు లేనప్పటికీ కేసు నమోదైతే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. ప్రమాదాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. హైవేల పక్కన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమైనా, రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కనే ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మోడీ తెచ్చిన క్రిమినల్‌ చట్టాలను ఆపాలని తమిళనాడు, బెంగాల్‌, కేరళ ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రవాణా రంగ సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ అధ్యక్షులు చొక్కాపు లోకేష్‌, సవరాల అప్పారావు, రాంబారికి రామకృష్ణ, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

➡️