పండగలా పింఛన్ల పంపిణీ

Jul 1,2024 20:58

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా వ్యాప్తంగా ఎన్‌టిఆర్‌ భరోసా పింఛను మొత్తాల పంపిణీ కార్యక్రమం అన్ని గ్రామాలు, పట్టణాల్లో సోమవారం పండగ వాతావరణంలో జరిగింది. జూలై నెలకు సంబంధించి పెంచిన ఫించను మొత్తం రూ.4000 తోపాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన పెరిగిన ఫించను బకాయిలు రూ.3000 కలిపి ఒకే సారి రూ.7000 తమ చేతికి అందడంతో ఫించనుదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, గ్రామాల్లోని ఇతర ప్రభుత్వ సిబ్బంది ఫించనుదారుల ఇళ్లకు వెళ్లి పింఛను మొత్తాలు అందించారు. సర్వర్‌లో చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడక్కడా కొంత జాప్యం జరిగింది. తొలిరోజు 96.71 శాతం పింఛన్లు అందజేసి, రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా తొలిస్థానంలో నిలిచినట్లు కలెక్టర్‌ అంబేద్కర్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ డా.అంబేద్కర్‌, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ కళ్యాణచక్రవర్తి తదితరులు డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి జిల్లాలో ఫించన్ల పంపిణీని పర్యవేక్షించారు. కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ సహా జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలూ తమ నియోజకవర్గాల్లో ఫించను మొత్తాల పంపిణీలో పాల్గొన్నారు. కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ నగరంలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలోని చాకలివీధిలో స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలసి పింఛను పంపిణీచేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌డిఎ పీడీ ఎ.కళ్యాణ్‌ చక్రవర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు, సహాయ కమిషనర్‌ తిరుమలరావు, తాహశీల్దార్‌ రత్నం, బొద్దల నరసింగరావు, శ్రీదేవి తదితర పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. కోరుకొండ, మలిచర్ల పంచాయతీల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యాన పింఛన్లు అందజేశారు. టిడిపి నాయకులు టి.రామారావు, కె.శివ, ఎస్‌.రామునాయుడు, ఎస్‌.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. బడుకొండపేట పంచాయతీ రామజోగి పేటలో టిడిపి నాయకులు పాశి అప్పలనాయుడు పింఛను మొత్తంతో పాటు స్వీటు పంచిపెట్టారు. జొన్నవలసలో ఎంపిటిసి సభ్యులు రాజేష్‌బాబు ఆధ్వర్యాన పింఛన్లు పంపిణీ చేశారు.21వ డివిజన్‌లో జరిగిన పింఛన్ల పంపిణీలో టిడిపి నాయకులు అవనాపు విజరు, కాళ్ల గౌరీశంకర్‌, గాడు అప్పారావు, బొద్దల నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, రాజేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం గంట్యాడ మండల కేంద్రంలోనూ, బొండపల్లి మండలం గొట్లాంలోనూ పింఛను పంపిణీలో కలెక్టర్‌ అంబేద్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో ఫించను మొత్తాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. పింఛనుదారులు ఎక్కడైనా అందుబాటులో లేని పక్షంలో మాత్రమే మరుసటిరోజు అందజేస్తామని తెలిపారు.

➡️