పసుపుమయమైన పింఛన్ల పంపిణీ

Jul 1,2024 21:04

ప్రజాశక్తి-జామి : ప్రభుత్వ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పసుపుమయమైంది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో అధికారులు పింఛన్లు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సహజంగా అధికారులు చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందించడం ఆనవాయితీ. ప్రజాప్రతినిధులతో పంపిణీ చేయించినా ఎవరూ కాదనరు. గత ప్రభుత్వంలో వాలంటీర్లతో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. కొత్త ప్రభుత్వం కావడంతో ఎన్నికల హామీ అమల్లో భాగంగా పింఛను పెంపు అమలు చేసిన సందర్భంగా ప్రారంభోత్సవం అట్టహాసంగా చేపట్టారు. జామి మండలంలో 9,297 మందికి సుమారు రూ.6.50 కోట్ల వరకు పింఛను నగదు అందజేయాలి. అయితే ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పింది. కానీ అధికారులే నేరుగా టిడిపి నాయకులు, కార్యకర్తలు చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. జామి గ్రామంలో సోమవారం అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో ఒకటి, రెండు పింఛన్లు అందజేసి, మిగిలిన పింఛనుదారులకు టిడిపి కార్యకర్తలతో పింఛను సొమ్ము అందజేశారు. సచివాలయ సిబ్బంది మొదటి పింఛను అందించి, ఉన్నతాధికారులకు ఫొటోలు పంపుకుని, మిగిలినవి టిడిపి నాయకులతో పంపిణీ చేయించినట్లు తెలుస్తోంది. ఇదంతా అధికారుల సమక్షంలో జరగడం గమనార్హం. ఇలా దాదాపుగా ప్రభుత్వ పింఛన్ల కార్యక్రమం పసుపుమయంగా మారిందన్న చర్చకు దారితీసింది.
సర్వర్‌ పాట్లు
తెల్లవారింటికి ఇంటికి వచ్చి సచివాలయ సిబ్బంది పింఛను సొమ్ము అందజేస్తారని ఆశించిన లబ్ధిదారులకు సర్వర్‌ నిరాశ మిగిల్చింది. ఉదయం 9.30 గంటల నుంచి మండలంలో సర్వర్‌ పనిచేయలేదు. దీంతో లబ్దిదారులు సిబ్బంది చుట్టూ తిరిగిన పరిస్థితి నెలకొంది. సిగల్‌ కోసం సిబ్బంది కూడా నానా ఇబ్బంది పడ్డారు. ఇలా మధ్యాహ్నానికి మండలంలో 60 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎంపిడిఒ తిరుమలరావు తెలిపారు. అయితే టిడిపి నాయకుల చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ వ్యవహారంపై వివరణ కోరగా, తన దృష్టికి రాలేదని దాటవేశారు.

➡️