మన్యం జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు

May 4,2024 21:42

సాలూరు : ఇండియా వేదిక సిపిఎం ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స పట్టణంలో, మండలంలో శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్వైనాయుడు, ఎం.శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ నాయకులు సిగడాపు బంగారయ్య, ద్వారపు రెడ్డి పుండరీకాక్ష నాయుడుతో కలిసి ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరస పట్టణంలో పలువురు ప్రముఖులు, ఓటర్లను కలిశారు. కాంగ్రెస్‌ నాయకులు విక్రం చంద్ర సన్యాసి రాజు, కూనిశెట్టి జెట్టిదొరను వారి నివాసాలకు వెళ్లి కలిశారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ లు బలపర్చిన అరుకు ఎంపీ అభ్యర్థి అప్పలనరసను గెలిపించాలని కోరారు. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతున్న యువకులు, క్రీడాకారులను కలిసి మద్దతు తెలపాలని కోరారు. మండలంలోని కురుకుట్టి పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పట్టణం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపి అభ్యర్థి అప్పలనర్స మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. సాలూరు నుంచి అరకు వరకు మన్యం ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన పార్లమెంటు నియోజకవర్గం ఇప్పటికీ వెనుకబడి వుందన్నారు. ఇంతవరకు పనిచేసిన టిడిపి, వైసిపి ఎంపీలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు. సాలూరు మండలంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి గతంలో అరుకు ఎంపీ గా పని చేసిన కొత్తపల్లి గీత కూడా సహకరించారని చెప్పారు. ఏజెన్సీలో సహజవనరుల దోపిడీ విషయంలో టిడిపి, వైసిపి, బిజెపి విధానాలు ఒక్కటేనన్నారు. పట్టణాల్లో ప్రజలపై చెత్త పన్ను విధించడం అన్యాయమన్నారు. తాను ఎంపీగా గెలిస్తే గిరిజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్లమెంటులో పోరాడుతానని చెప్పారు. సిపిఎం ఎంపి అభ్యర్థిగా తన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని అప్పలనర్స కోరారు.పాచిపెంట : మండలంలోని పాచిపెంట, అమ్మవలస, కర్రివలస, గైరంపేట తదితర గ్రామాల్లో అరకు పార్లమెంట్‌ సిపిఎం ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరస ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొత్తపల్లి గీత ఎంపిగా గెలిచి గిరిజన ప్రాంతంలో బాక్సైట్లను, గ్రీన్‌ గ్రానైట్లను అదానీకి అప్పజెప్పాలని చూస్తున్నారని, గెలిచిన తర్వాత ఆమె ముఖం కూడా అరకు నియోజకవర్గ ప్రజలకు చూపించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్‌ నెంబర్‌ -1 గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు, మంచాల శ్రీనివాసరావు, ఎన్‌వై నాయుడు, బోను గౌరు నాయుడు, మర్రి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.గరుగుబిల్లి: సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు గరుగుబిల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు, సుంకి సర్పంచి బివి రమణ, బి.శంకరరావు, కె.రవీంద్ర మాట్లాడుతూ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మండంగి రమణ, అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పల నరస గుర్తులైన సుత్తి, కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో నాయకులు కె.రామారావు, డి.వెంకటనాయుడు, బాబురావు, కె.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలోని మామిడి మానుగోరా, కొండవాని గోర, పెద్దూరు, ఎస్‌ గోపాలపురం ,అచ్చెప్ప వలస, గంగంపేట, వంకాయల గడ్డ , జరడ కాలనీ తదితర గ్రామాల్లో సిపిఎం నాయకులు కె.మోహనరావు విస్తతంగా ప్రచారం చేపట్టారు. ఇండియా వేదిక బలపర్చిన అరకు పార్లమెంటరీ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు మీ అమూల్య మైన ఓటు వేయాలని, పాలకొండ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సవర చంటి బాబుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎం.సింహాచలం, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️