బడి ఇలా.. చదువులు సాగేదెలా?

Jun 17,2024 21:03

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ : ఈ చిత్రంలో కూర్చున్న చిన్నారులు, విద్యాబుద్ధులు నేర్పుతున్న మహిళను చూసి ఇదేదో మారుమూల గ్రామంలో ‘ప్రయివేటు’ అనుకుంటారేమో! అలా అనుకుంటే పొరపాటే. చదువుతున్న మహిళ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వారంతా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు. ఇంతకీ ఏం జరిగిందంటారా.?వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ఈ నెల 13న పునఃప్రారంభ మయ్యాయి. చాలీచాలని ఇరుకు గదుల్లో పాఠాలు నేర్చుకొనేందుకు కొందరు విద్యార్థులు సిద్ధం కాగా, మరికొందరు ప్రయివేటు పాఠశాలలకు వెళ్లేందుకు చూస్తున్నారు. మండలంలో గత ప్రభుత్వం మనబడి నాడు – నేడు కార్యక్రమంలో నిధులు మంజూరు చేసినా చాలాచోట్ల అదనపు తరగతి గదులు పూర్తికాలేదు. భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. భోజరాజపురం పాఠశాల భవనం శిథిలావస్థకు చేరినా అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గిరిజన గ్రామం బట్టివలసలో పురిపాకలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అలజంగి గ్రామంలో ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నాలుగు మంజూరైనా రెండు మాత్రమే స్లాబ్‌ వేసి వదిలేశారు. బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో అదనపు తరగతి గదులు అవసరమున్నా మంజూరు చేయలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలో తెలియక ప్రయివేటు పాఠశాలల్లో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు. బట్టివలస, భోజరాజపురంలో పాఠశాల భవనాలకు ప్రతిపాదనలు పంపించామని ఎంఇఒ లక్ష ్మణరావు తెలిపారు.

➡️