ఆయకట్టుకు నీరందేనా?

May 26,2024 21:05

ప్రజాశక్తి – వంగర : వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాబోతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూడా పొలాల్లో దుక్కులు చేసి ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్నారు. వర్షంతో సంబంధం లేకుండా మడ్డువలస ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. అటువంటి కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ముళ్లపొదలు, చెట్లు, చెత్తా చెదారంతో పూడికలు పేరుకుపోయాయి. ఖరీఫ్‌ సీజన్‌ దగ్గర పడుతున్నా కనీసం పూడికతీత పనులు కూడా చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టుకు సక్రమంగా సాగునీరందేనా? అన్న సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. మండలంలోని గొర్లె శ్రీరాములునాయుడు మడ్డువలస ప్రాజెక్టు నుంచి వంగర, రేగిడి, సంతకవిటి మండలాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం, పొందూరు, ఎచ్చెర్ల, లావేరు మండలాల పరిధిలో 37,377 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అందులో మొదటి దశలో వంగర మండలంలో 996, రేగిడి మండలంలో 6,777, సంతకవిటి మండలంలో 10,976, జి.సిగడాం మండలంలో 6029, పొందూరు మండలంలో 99 ఎకరాలకు.. మొత్తం 24,877 ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. స్టేజ్‌-2లో జి.సిగడాం మండలంలో 536, పొందూరు మండలంలో 5173, లావేరు మండలంలో 5474, ఎచ్చెర్ల మండలంలో 1317 ఎకరాలకు.. మొత్తం 12,50గెకరాలకు సాగునీరు అందించాలన్నది ఉద్దేశం. ప్రాజెక్టు ప్రారంభమై 20 ఏళ్లు గడిచినా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు నేటికీ చేపట్టలేదు. పిల్ల కాలువల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉంది. దీంతో రైతులకు ఏటా సాగునీటి కష్టాలు తప్పడం లేదు. లీకులతో సాగునీరు వృథా మడ్డువలస ప్రాజెక్టు ప్రధాన గేట్లకు లీకులు కావడంతో కొన్నేళ్లుగా సాగునీరు వృథాగా పోతుంది. ఈ లీకులను అరికట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో లీకుల ద్వారా దిగువకు సాగునీరంతా వృథాగా పోవడం వల్ల నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను, పూడికలను తీస్తే తప్ప ఈ ఏడాది ఖరీఫ్‌కు నీరందడం కష్టమని రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఆ దిశగా పనులు చేపట్టడం లేదు. వాస్తవానికి ఈ వేసవిలో కాలువల్లో ఉన్న పూడికలు తొలగించి ఖరీఫ్‌కు ఎటువంటి ఆటంకమూ లేకుండా సాగునీటికి క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు కాలువ పనులపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఎన్నిసార్లు చెప్పినా పట్టడం లేదు
ఎడమ కాలువ గట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. సాగునీరు విడిచి పెట్టే సమయంలో గట్లు గండి పడటం వల్ల పంటనష్టం కూడా జరిగి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయం అధికారు లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.- పోలిరెడ్డి చంద్రినాయుడు, రైతు, మగ్గూరు
ప్రతిపాదనలు పంపించాం
ఎడమ కాలువలో పేరుకుపోయిన పూడిక తీతలకు ప్రతిపాదనను పంపించాం. ఆమోదం వచ్చిన వెంటనే పనులు చేపడతాం. కుడి కాలువకు సంబంధించి రేగిడి, సంతకవిటి మండలాల వద్ద ఉపాధి హామీ పనుల ద్వారా పూడికతీత పనులు చేపడుతున్నాం.- పి.అర్జున్‌, మడ్డువలస ప్రాజెక్టు డిఇఇ

➡️