కేజ్రీవాల్ అక్రమ అరెస్టుపై నిరసనలు

Mar 22,2024 16:38 #Vizianagaram

సిపిఎం, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ అక్రమంగా అరెస్ట్ చేయించిందని, ప్రజాస్వామ్యానికి చీకటి రోజని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.దయానంద్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్ రావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుంకరి సతీష్ లు అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను వారు తీవ్రంగా ఖండిస్తు స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద.శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ లిక్కర్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు దర్యాప్తు సంస్థలు నిరూపించలేకపోయాయని, ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ లను అరెస్ట్ చేసినా బీజేపీతో తాము రాజీ పడకపోవడం వల్లనే చివరికి సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిందని అన్నారు. మోడీ పాలనలో అవినీతి, అక్రమాలు, అత్యాచారాలు చేసినవారు, బ్యాంకులకు ఎగనామం పెట్టి ప్రజల సొమ్ముతో విదేశాలు పారిపోయినవారికి రక్షణగా వున్న బీజేపీ నిజాయితీగా పాలన చేస్తున్న ఆప్ నేతలను, విపక్షాలను వేధింపులకు గురి చేస్తుందని ఆవేదన చెందారు. చండిగడ్ మేయర్ ఎన్నికలలో ఓట్ల దొంగతనం, ఎలక్టోరల్ బాండ్ల అంశంలో సుప్రీం కోర్ట్ తీర్పులతో అభాసుపాలయిన బీజేపీ వాటి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇటువంటి చర్యలు చేపడుతుందని అన్నారు. తమను ఎంతగా వేదించినా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అన్నారు. కేజ్రీవాల్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు పూసపాటి ప్రతాప్ వర్మ, అనిల్, బూరాడ శ్రీనివాస్, పి. సురేష్, తిప్పాన కోటేశ్వరరావు, నయీమ్, టీవీ, నర్సింహులు, కిలాని శ్రీనులతో పాటు కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️