నాణ్యమైన విద్యే లక్ష్యం

Jun 16,2024 21:44

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నూతన విద్యా సంవత్సరంలో మెరుగైన, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. అందుకు అనుగుణంగా విద్యా ప్రణాళికను అమలు చేస్తామన్నారు. ఈ వారం తనను కలిసిన ‘ప్రజాశక్తి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జిల్లాలో విద్యా రంగ పరిస్థితిపై, విద్య మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు..
నూతన విద్యా సంవత్సరానికి ఎలా సన్నద్ధమయ్యారు.?
2024-25 విద్యా సంవత్సరంలో మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. ఈ నెల 13 నుంచి పాఠశాలలు ప్రారంభమ య్యాయి. విద్యార్థులు పాఠశాలల్లో అడుగు పెట్టేటప్పటికీ ఆహ్లాదకరంగా పాఠశాల ఉండేలా జూన్‌ మొదటి వారం నుంచి పాఠశాలలను ఉపాధ్యాయులు సుందరంగా తయారు చేశారు.
బడిలో పిల్లల్ని చేర్పించేందుకు చేపట్టిన చర్యలు ఏమిటి.?
విద్యా సంవత్సరంలో బడిబయట పిల్లలు లేకుండా చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘నేను బడికి పోతా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి జులై 11 వరకు ఉపాధ్యాయులు, వాలంటీర్ల సహకారంతో ఆ కార్యక్రమాన్ని చేపడతాం.
విద్యార్థి కిట్లు పంపిణీ ఎంతవరకు వచ్చింది.?
ప్రభుత్వ పాఠశాలల్లోని 1,28,189 మంది విద్యార్థులకు విద్యార్థి కిట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాగ్‌, టై, షూ, బెల్ట్‌, నోట్‌ పుస్తకాలు వందశాతం వచ్చాయి. ఆయా మండల కేంద్రాలకు, పాఠశాలలకు కిట్లను పంపించాం. యూనిఫార రావాల్సి ఉంది.
పాఠ్యపుస్తకాలు ఎంతవరకు వచ్చాయి.?
పాఠ్యపుస్తకాలు పదో తరగతి ఫిజికల్‌ సైన్స్‌ తప్ప అన్ని వచ్చాయి. అవి కూడా సోమవారం పూర్తి స్థాయిలో వస్తాయి. 9.15 లక్షలు పాఠ్యపుస్తకాలు ప్రతిపాదన పెట్టగా, ఆ మేరకు జిల్లాకు చేరుకున్నాయి.
పదోతరగతి సిలబస్‌ మార్పుపై తీసుకుంటున్న చర్యలు ఏమిటి.?
ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌ మారింది. విద్యార్థులు మారిన సిలబస్‌ను అర్థం చేసుకునేలా బోధించడం కోసం మరో రెండు రోజుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాం.
పదో తరగతి ఫలితాల మెరుగుదలకు ప్రణాళిక ఏమిటి.?
ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపే విధంగా విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే స్కూల్‌ అసిస్టెంట్‌, సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశాం. మండల విద్యా శాఖ, సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులతో చర్చించి ప్రణాళిక తయారు చేసి దానిని అమలు చేస్తున్నాం. 2023-24లో ఫలితాలు మెరుగయ్యాయి. ఈ ఏడాది వందశాతం ఫలితాలే లక్ష్యంగా పని చేస్తాం.
హైస్కూల్‌ ప్లస్‌లో ప్రవేశాలు ఎలా ఉన్నాయి.?
ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో ఏడు ప్రభుత్వ హైస్కూళ్లలో ఇంటర్‌ తరగతులు ప్రారంభిస్తున్నాం. బొండపల్లి, జామి, కోనూరు, రామభద్రపురం, ఎ.వెంకటాపురం, పిరిడి హైస్కూల్లో జూనియర్‌ ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతికి 40 మంది విద్యార్థులకు గాను ఇప్పటికే 60 శాతం వరకు అదే హైస్కూల్లో చదివి పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారిని చేర్పించాం. వీటిలో కొత్త అధ్యాపక పోస్టులు రాలేదు. పాఠశాలలో ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయుల ద్వారా బోధన కొనసాగుతుంది. స్కూల్‌ అసిస్టెంట్లలో జూనియర్‌ కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. బోధనకు ఎటువంటి సమస్యా లేదు. విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు, నిష్ణాతులైన ఉపాద్యాయులు ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తల్లిదండ్రులు కూడా విద్యార్థులను చేర్పించాలి.
సిబిఎస్‌ఇ సిలబస్‌ బోధన ఎన్ని పాఠశాలల్లో చేపడుతున్నారు.?
జిల్లాలో 63 పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ బోధిస్తున్నాం. గత ఏడాది నుంచి తరగతులు నిర్వహిస్తున్నాం.
విద్యా ప్రమాణాలు మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు.?
విద్యా ప్రమాణాల మెరుగుదలకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయులను అందుకు సన్నద్ధం చేశాం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా విద్యా బోధన చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి. నాణ్యమైన విద్యను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు తల్లిదండ్రులు సహకరించాలి.

➡️