పలు చోట్ల వర్షం

Jun 17,2024 21:00

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో సోమవారం వేకువ జామున పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 14 మిల్లీమీటర్ల వర్షం పడింది. తెల్లవారి 4గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళన చెందారు. సుమారు రెండుగంటల పాటు వర్షం కురిసింది. వర్షంతో పాటు గాలి వీయడంతో పూత దశలో ఉన్న నువ్వుపంటకు నష్టం వాట్లిందని నువ్వు రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఖరీఫ్‌ విత్తనాలు వేసేందుకు వర్షం అనుకూలించిందని రైతులు అంటున్నారు. అత్యధికంగా రామభద్రపురం మండలంలో 39.6మి.మీ, అత్యల్పంగా గజపతినగరంలో 1.4మి.మీ, వర్షం కరిసింది.
ప్రధాన రహదారికి అడ్డంగా పడిన భారీ వృక్షం
రేగిడి : మండలంలోని తాటిపాడు కూడలి వద్ద సోమవారం ఉదయం మర్రిచెట్టు కొమ్మకు ఎత్తైన లోడుతో వచ్చిన లారీ భారీ వృక్షానికి తగిలి పెద్ద కొమ్మ విరిగిపడింది. రోడ్డు మధ్యలో పెద్ద కొమ్మ పడిపోవడంతో పాలకొండ-రాజాం ప్రధాన రహదారి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ, విజయనగరం, రాజాం, పాలకొండ నుంచి వచ్చిన ఆర్‌టిసి ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. స్థానికులు పోలీస్‌, ఆర్‌అండ్‌బి అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపు స్థానిక షా మిల్లు యజమాని స్పందించి ట్రాక్టర్‌ సహాయంతో కొమ్మలను తొలగించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి ప్రయాణికులు ఉపశమనం పొందారు.

➡️