ఫుడ్‌కోర్టు భూముల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలు

Jun 16,2024 21:37

ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని తూడెం పంచాయతీ బసవపాలెం రెవెన్యూ పరిధిలోని ఫుడ్‌కోర్టుకు కేటాయించిన భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా ఫ్రీహోల్డ్‌ చేసిన డి-పట్టా భూములను రిజిస్ట్రేషన్లు చేయకుండా చూడాలని రెవెన్యూ అధికారులు స్థానిక సబ్‌ రిజిస్టార్‌కు ఆదేశించినట్లు సమాచారం. ఫ్రీహోల్డ్‌ పట్టాలను రద్దు చేసేందుకు కూడా రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.బసవపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 25లో ఫుడ్‌ కోర్టు కోసం 70 ఎకరాలను 2019లో అప్పటి ప్రభుత్వం ఎపిఐఐసి ద్వారా కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో 18 ఎకరాలు ప్రభుత్వ భూమి. మిగతా 52 ఎకరాలు డి-పట్టాలు ఉన్న రైతులవి. ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేయాలనుకున్న ప్రయివేటు సంస్థ రైతుల డి-పట్టా భూములకు ఎకరాకు రూ.12.50 లక్షలు చొప్పున ఇచ్చేందుకు అప్పట్లో ధర నిర్ణయించారు. ఈ మేరకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున అడ్వాన్సులు కూడా అప్పట్లో చెల్లించారు. ఇటీవల వీరికి కేటాయించిన భూముల్లో ప్రభుత్వ భూమిని ఏకంగా జిఎంఆర్‌ సంస్థకు విమానాశ్రయ సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి క్వార్టర్స్‌ నిర్మాణానికి కేటాయించేశారు. మిగతా 52 ఎకరాల్లోని సుమారు 30 ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్‌ పట్టాలు ఇచ్చేశారు. మాజీ సిఎస్‌ జవహర్‌ రెడ్డి బినామీలు ఈ భూములను కొనుగోలు చేయడం వల్లే ఫ్రీ హోల్డ్‌ పట్టాలు ఇచ్చారని ఇటీవల విశాఖ కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఫుడ్‌కోర్టు సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. వెంటనే దిద్దుబాటు చర్యలు ఫుడ్‌ కోర్టు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెవెన్యూ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫ్రీ హోల్డ్‌ పట్టాలు ఇచ్చిన డి-పట్టా భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా స్థానిక సబ్‌ రిజిస్టార్‌కు తెలియజేశారు. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్‌ పట్టాలు కూడా రద్దు చేయాలనే ఆలోచనకు కూడా రెవెన్యూ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.

➡️