వేగావతి ఉధృతి

Jun 16,2024 21:41

ప్రజాశక్తి-బొబ్బిలి : ఒడిశాలో వర్షాలతో వేగావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పారాది వంతెన వద్ద నిర్మించిన కాజ్‌వే (డైవర్షన్‌ రోడ్డు)పై నుంచి వరదనీరు ప్రవహించింది. దీంతో రోడ్డు మధ్యలో ఒక రంధ్రం ఏర్పడగా, మరోచోట రోడ్డు కిందకు జారింది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డుపై నుంచి వరదనీరు ప్రవహించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన డిఎస్‌పి శ్రీనివాసరావు నదిని పరిశీలించి ప్రమాదాల నివారణకు వాహనాలను దారి మళ్లించారు. బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్లే వాహనాలను బాడంగి, తెర్లాం, రాజాం మీదుగా పంపించారు. రామభద్రపురం నుంచి బొబ్బిలి వచ్చే వాహనాలను అదే రోడ్డు మీదుగా దారి మళ్లించారు. పారాది వంతెన కుంగి ఏడాదైనా నూతన వంతెన పనులు ప్రారంభించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన వంతెన పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.నాసిరకం పనుల వల్లే : సిపిఎం నాసిరకం పనులు చేయడం వల్లే పారాది వంతెన వద్ద వేసిన డైవర్షన్‌ రోడ్డు కొట్టుకుపోతుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు అన్నారు. కొట్టుకుపోయిన డైవర్షన్‌ రోడ్డును ఆదివారం ఆయన పరిశీలించారు. రూ.లక్షలు ఖర్చు చేసి కాజ్‌వే నిర్మించినా, పనుల్లో నాణ్యత లేకపోవడంతో రోడ్డు కొట్టుకుపోతుందని ఆయన తెలిపారు. రోడ్డుపై రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారాది వంతెన పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️