స్ట్రాంగ్‌ రూములను సిద్దం చేయాలి

Apr 23,2024 22:09

విజయనగరం : ఓట్ల లెక్కింపు కేంద్రాలవద్ద స్ట్రాంగ్‌ రూమ్‌లను సిద్దం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూములు, లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్‌ సెంటర్లలో ఏర్పాటుపై నోడల్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జెఎన్‌టియుజివి, లెండి కళాశాలల్లో ఏర్పాటు చేయనున్నస్ట్రాంగ్‌ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్‌ సెంటర్లు, ఫుడ్‌ కోర్టులు, పార్కింగ్‌ ప్రాంతం, లోపలికి రాకపోకలు మార్గాలు తదితర అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నిక ప్రక్రియ ముగించి ఎంతో అలసిపోయి వచ్చే సిబ్బంది ఏమాత్రం ఇబ్బంది పడని విధంగా రిసెప్షన్‌ సెంటర్‌ వద్ద ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. పోలింగ్‌ సిబ్బంది సాయంత్రం 7 గంటల నుంచీ రిసెప్షన్‌ సెంటర్‌కు చేరుకొనే అవకాశం ఉందని, అప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. వారు తమకు కేటాయించిన కౌంటర్‌ వద్దకు చేరుకొనే విధంగా ప్రారంభం నుంచే డెరెక్షన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చిన వారి దగ్గరనుంచి ఇవిఎంలను తీసుకొని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించేందుకు సరిపడా సిబ్బందిని సిద్దం చేయాలని సూచించారు. తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని, స్పెషల్‌ కౌంటర్‌లో ఇవిఎంలు, సాధారణ కౌంటర్లలో ఇతర ఎన్నికల సామగ్రిని స్వీకరించి, భద్రపరచాలని సూచించారు. వేసవిని దష్టిలో ఉంచుకొని స్టాండింగ్‌ ఫ్యాన్లు, కూలర్లును ఏర్పాటు చేయాలన్నారు.వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, అవసరమైనవారికి వైద్య సహాయాన్ని అందించాలని ఆదేశించారు. పరిశీలకులకు, ఆర్‌ఓలకు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గేటువద్దే హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసి, వచ్చే వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. మే 12వ తేదీ నాటికే వీటి ఏర్పాటు పూర్తి కావాలన్నారు. లెండి కళాశాల వద్ద సుమారు 14వేల మందికి, జెఎన్‌టియు వద్ద సుమారు 6వేల మందికి భోజన సదుపాయం కల్పించాల్సి ఉంటుందన్నారు. రోజుస్ట్రాంగ్‌ రూములనుంచి రిసెప్షన్‌ సెంటర్ల వరకు మూడంచెల భద్రతావ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ అనిత, ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, నోడల్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️