ప్రతీ రైతుకు విత్తనాలు అందిస్తాం

Jun 17,2024 20:59

ప్రజాశక్తి-గజపతినగరం : ప్రతీ రైతుకు విత్తనాలు అందేలా చేస్తామని చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీఇచ్చారు. రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గజపతినగరం మార్కెట్‌ యార్డులో ఆయన సోమవారం ప్రారంభించారు. 1121 రకం వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కౌలురైతులకు సైతం విత్తనాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా విత్తనాలు సమకూర్చాలని వ్యవసాయ శాఖకు సూచించారు. ఎరువులు కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తాను మంత్రిగా పాల్గొన్న తొలి కార్యక్రమం రైతులకు మేలు చేసేది కావడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి విటి రామారావు మాట్లాడుతూ జిల్లాలో పంటల పరిస్థితిని వివరించారు. గతేడాది సుమారు 40 వేల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై అందజేశామని తెలిపారు. ఈ ఏడాది 46 వేల క్వింటాళ్లు అవసరమని గుర్తించామని, దీనిలో 32 వేల క్వింటాళ్లు రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఇప్పటికే సుమారు 7 వేల క్వింటాళ్ల పంపిణీ జరిగిందని తెలిపారు. వ్యవసాయ శాఖ గజపతినగరం ఎడి కె.మహరాజన్‌ మాట్లాడుతూ రైతులు వన్‌బి తీసుకువెళ్లి రాయితీపై విత్తనాలను పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ఆర్‌డిఒ ఎ.సాయిశ్రీ, విజయనగరం ఎడి నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

➡️