సుందరయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఉధృతం

May 19,2024 20:54

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌/టౌన్‌ : పుచ్చలపల్లి సుందరయ్య బాటలో ప్రజాపోరాటాలు ఉధృతం చేస్తూ, ప్రజాసేవను ఆచరణలో పెట్టడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని తాన్నవలస, కొత్తవలస, పట్టణంలో సుందరయ్య భవనంలో, మూడో వార్డు వివేకానంద కాలనీలో సుందరయ్య వర్ధంతి సభలు, సమావేశాలు ఆదివారం జరిగాయి. తొలుత స్థానిక సుందరయ్య భవనంలో పట్టణ సిపిఎం కార్యదర్శి జి.వెంకటరమణ అధ్యక్షతన జరగ్గా, గంగాపురం పంచాయతీ తాన్నవలసలో సిపిఎం మండల కార్యదర్శి బంటు దాసు అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణమూర్తి మాట్లాడారు. సుందరయ్య ఆశయాలు, కర్తవ్యాలు కష్టజీవులు, కార్మికులు, గిరిజనులకు, ప్రజలకు సేవ చేయడమేనన్నారు. కమ్యూనిస్టులు ప్రజల్లో కలిసిపోయే విధానాన్ని పార్టీలో ప్రారంభించిన ధీరోదాత్తుడు, ప్రజా సేవకుడు, పోరాటయోధుడు సుందరయ్య అని కొనియాడారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం నిర్మించాలన్న పట్టుదలతో అన్ని వర్గాలను కలుపుకొని ప్రజా ఉద్యమాల్ని సమైక్య, భాష ప్రయోక్త రాష్ట్రం ఏర్పాటుకు పనిచేశారన్నారు. ఇప్పటికీ సుందరయ్య బాటే ఆంధ్రరాష్ట్రానికి అనుసరణీయమన్నారు. దేశంలో ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సిపిఎం నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ప్రజలకు సేవ చేయటమే విప్లవకారులు వృత్తిగా ఉండాలని సుందరయ్య కోర్కె అని, దాన్ని మనమంతా అమలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొలుత సుందరయ్య భవనంలో సిపిఎం జెండాను జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరయ్య దేశంలో, రాష్ట్రంలో పోరాడే ఎర్రజెండాను, పోరాట పంథాలు ప్రజలకు నేర్పారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజాపోరాటాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సుందరయ్య భవనంలో, రావికాన పంచాయతీ కొత్తవలస, పట్టణంలో వివేకానంద కాలనీలో సుందరయ్య ఫోటోకు పూలదండలు వేసి నివాళులర్పించి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రతినపూనారు. కార్యక్రమాల్లో సిపిఎం పట్టణ, మండల నాయకులు బంకురు సూరిబాబు, రెడ్డి శ్రీదేవి, సంచాన ఉమా, కె.రామస్వామి, కృష్ణ, ప్రజాసంఘాల నాయకులు, లాయర్‌ ఎం.వెంకట్రావు, పి.రాము, వరలక్ష్మి, బాషా, జి సింహాచలం, లక్ష్మణరావు, బలరాం, బంటు ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
స్ఫూర్తి దాత సుందరయ్య
విజయనగరం టౌన్‌ : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య పోరాట యోధులకు స్ఫూర్తి దాతని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు కొనియాడారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా నగరంలోని రామకృష్ణ నగర్‌లో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం సుందరయ్య చేసిన కృషి, పోరాటం అందరికీ ఆదర్శమన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా, కార్మికులు, పేదల ప్రభుత్వం కోసం, అంతరాలు లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన స్ఫూర్తితో దోపిడీ, అంతరాలు లేని సమాజం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు శాంతమూర్తి, జగదాంబ, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సుందరయ్య బాటలో నడుద్దాం
సుందరయ్య బాటలో సమసమాజం కోసం ఉద్యమించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.శ్రీనివాస కోరారు. సుందరయ్య వర్థంతి సందర్భంగా స్థానిక ఎల్‌బిజి భవనంలో ఆయన చిత్రపటానికి శ్రీనివాస పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్డి శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస మాట్లాడుతూ దేశంలో నేడు దుర్మార్గమైన మోడీ పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్లు లేని బిజెపి వెనుక రాష్ట్రంలోని వైసిపి, టిడిపి వెళ్తున్నాయంటే రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. దోపిడీ వర్గాల చేతుల్లో పాలన ఉందని చెప్పారు. ప్రజలను ఐక్యం కాకుండా మతం, కులాలు పేరుతో విభజించి దోపిడీ శక్తులకు పాలన అప్పగించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం, సామాజిక అంతరాలు లేని సమాజం కోసం సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముందుగా ఎల్‌బిజి భవనంపై సిపిఎం జెండాను నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎ.జగన్మోహన్‌, బి.రమణ, రామ్మోహన్‌, యుఎస్‌ రవికుమార్‌, త్రినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️